Brain stroke: మాటిమాటికీ తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది తలెత్తుతుందా? జాగ్రత్త మీ ఆరోగ్యం డేంజర్‌లో ఉన్నట్లే
అత్యంత ప్రమాదకరమైన జీవనశైలి సమస్యలలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఇది వచ్చేముందు మనకు కొన్ని సంకేతాలను పంపుతుంది. వాటిని బట్టి మనం వెంటనే అప్రమత్తం అవ్వాలి. లేదంటే అనతికాలంలోనే బ్రెయిన్ స్ట్రోక్ దాడి చేస్తుంది..
మన దేశంలో అత్యధిక మరణాలకు మూడో ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్. అధిక బీపీ, మధుమేహం, ఊబకాయం, అధిక పొగాకు వినియోగం స్ట్రోక్‌కు కారణం అవుతున్నాయి. యూఎస్‌కి చెందిన జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధనలో స్ట్రోక్ బతికినవారిలో ప్రతి 10 మందిలో 9 మంది పక్షవాతం అనుభవిస్తున్నట్లు వెల్లడించింది. కొంతమంది రోగులు పక్షవాతం కారణంగా వికలాంగులుగా మారుతున్నారు. అయితే స్ట్రోక్ రిహాబ్‌లో (స్ట్రోక్ తర్వాత కోలుకునే విధానం) 90 రోజులలోపు కోలుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పక్షవాతం తర్వాత వచ్చే దుష్ప్రభావాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఈ సమయంలో మెదడు న్యూరోప్లాస్టిసిటీ (మెదడు స్వయంగా రిపేర్ చేసుకునే సామర్థ్యం) గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. స్ట్రోక్ తర్వాత సకాలంలో స్ట్రోక్ రిహాబ్ చేస్తేనే ఫలితం ఉంటుంది.
HCAH సర్వే ప్రకారం.. పునరావాస కేంద్రాలలో కోలుకుంటున్న 92 శాతం మంది రోగులు మూడు నెలల్లోనే కోలుకున్నారు. ఇంట్లో కోలుకుంటున్న రోగులలో 70 శాతం మంది కోలుకోవడానికి నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. అటువంటి పరిస్థితిలో స్ట్రోక్ తర్వాత, డాక్టర్ను సంప్రదించి వీలైనంత త్వరగా స్ట్రోక్ రిహాబ్ ప్రారంభించాలని నిపుణులు అంటున్నారు.
స్ట్రోక్ తర్వాత స్ట్రోక్ రిహాబ్ ఎందుకు అవసరం?
ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లోని న్యూరాలజీ విభాగంలో డాక్టర్ సుధీర్ కుమార్ త్యాగి మాట్లాడుతూ.. స్ట్రోక్ ప్రాణాలతో బయటపడిన వారిని సమర్థవంతంగా కోలుకోవడంలో స్ట్రోక్ రిహాబిలిటేషన్ సెంటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ కేంద్రాలు పూర్తిస్థాయి కోలుకోవడానికి అవసరమైన భౌతిక చికిత్సను మాత్రమే కాకుండా, రోగులకు నిపుణుల బృందం ప్రత్యేక పరికరాలు, పద్ధతులతో చికిత్స అందించి, స్ట్రోక్ రికవరీలో శిక్షణనిచ్చే సమగ్ర విధానాన్ని అందిస్తాయి. దీంతో పక్షవాతం రాకుండా చాలా వరకు నిరోధించవచ్చు. అందువల్ల స్ట్రోక్ రోగులు పునరావాస కేంద్రాల సహాయం తీసుకోవాలని సూచించారు. దీంతో పక్షవాతం తర్వాత సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది.
స్ట్రోక్ లక్షణాలు
బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కొన్ని ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తాయి. అవేంటంటే.. ప్రతిరోజూ తీవ్రమైన తలనొప్పితో బాధపడటం. అస్పష్టమైన దృష్టి. మైకం కమ్మడం. మాట్లాడటం కష్టంగా అనిపించడం..వంటివి స్ట్రోక్ ప్రారంభ లక్షణాలు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం త్వరలోనే పలకరిస్తుంది.