“కొవాక్స్” టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే పరిహారం చెల్లిస్తాం.. అంగీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
టీకాల వల్ల ప్రమాదకర విపరిణామాలు తలెత్తితే, అందుకు పరిహారం చెల్లించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది.
WHO on COVAX Vaccine Side Effects : నిన్న మొన్నటి దాకా కరోనా మహమ్మరి నుంచి విముక్తి ఎప్పుడెప్పుడా నఅి ఎదుచూశాం. తీరా వచ్చాక వేయించుకోవాలా; వద్దా? అన్న సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా వల్ల దుష్ఫ్రభావాలు కలుగుతున్నాయని భయపడుతున్నారు. అయితే, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సహజమని, కొన్ని రోజుల్లోనే వీటి నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా మారుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ క్లారిటీ ఇస్తోంది.
అంతర్జాతీయ కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం ‘కొవాక్స్’ ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ 92 దేశాల ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టీకాల వల్ల ప్రమాదకర విపరిణామాలు తలెత్తితే, అందుకు పరిహారం చెల్లించేందుకు సంస్థ అంగీకరించింది. ఇది కొవిడ్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అమలు కానున్న ఏకైక నష్ట పరిహార కార్యక్రమం అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దీంతో ఆయా ప్రభుత్వాలకు పెద్ద ఊరట లభించింది.
భారత్‌తో సహా పలు ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలు కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా టీకాలను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ.. వాటి వల్ల దుష్ప్రభావాలు కలిగినప్పుడు ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలనేది ఆయా దేశాల ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. కొవాక్స్ పథకం ద్వారా టీకా తీసుకున్న వారిలో ఎక్కువగా విపరిణామాలు తలెత్తితే న్యాయస్థానం, ఫిర్యాదులు తదితర విధానాలతో నిమిత్తం లేకుండా అర్హులకు బేషరతుగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తోంది. కోవిడ్ టీకా వల్ల ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్ సంభవించడం నిజానికి చాలా అరుదని సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది.
కోవిడ్ టీకా పరిహారానికి సంబంధించిన దరఖాస్తులు మార్చి 31 నుంచి అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, ఈ వెసులుబాటు జూన్ 30, 2022 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండిః ఢిల్లీలో కోవిడ్ ఉధృతి పెరగకుండా చర్యలు.. రవాణా వ్యవస్థలో పరిమితులు విధిస్తూ ఆదేశాలు