AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ తెరమీదికి సంపద పన్ను… కోలుకోవడానికి అదే దారి

మూడేళ్ళ క్రితం మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంపద పన్నే మళ్ళీ దేశానికి పెద్ద దిక్కుకాబోతోందా ? గతంలో వున్న స్థాయికి మించి సంపద పన్ను విధిస్తేనే కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి గట్టెక్కగలదా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది ఆర్థిక వేత్తల నుంచి.

మళ్ళీ తెరమీదికి సంపద పన్ను... కోలుకోవడానికి అదే దారి
Rajesh Sharma
|

Updated on: Apr 16, 2020 | 7:48 PM

Share

మూడేళ్ళ క్రితం మోదీ ప్రభుత్వం రద్దు చేసిన సంపద పన్నే మళ్ళీ దేశానికి పెద్ద దిక్కుకాబోతోందా ? గతంలో వున్న స్థాయికి మించి సంపద పన్ను విధిస్తేనే కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి గట్టెక్కగలదా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది ఆర్థిక వేత్తల నుంచి. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన యూరప్ దేశాలు సంపద పన్ను విధింపుపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ కోణంలో మనదేశంలోను ఈ సంపద పన్నును విధించడం ద్వారా దేశాన్ని సంక్షోభం నుంచి త్వరగా గాడిలో పెట్టవచ్చన్న సూచనలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలు సైతం కుదేలైపోయాయి. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి యూరప్‌లోని ధనవంతులపై సంపద పన్నును విధించాలంటూ ప్రముఖ ఆర్థిక వేత్తలు, ఎకానమీ బుక్స్ రచయితలు కమిల్లే లాండాయిస్, ఎమ్మాన్యుయల్‌ సేజ్, గాబ్రియల్‌ సుజ్‌మన్‌ ‘ఏ ప్రొగ్రెసివ్‌ యురోపియన్‌ వెల్త్‌ టాక్స్‌ టు ఫండ్‌ ది యూరోపియన్‌ కోవిడ్‌ రెస్పాన్స్‌’ పేరిట ఓ వ్యాసాన్ని ప్రచురించారు. వారి ప్రతి పాదనలను యూరోపియన్‌ యూనియన్‌ ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది.

ఇండియా కూడా ఈ అంశాన్ని పరిశీలించాలంటున్న దేశీయ ఆర్థిక వేత్తలు. నిజానికి సంపద పన్ను మనదేశానికి కొత్త కాదు. గతంలో అంటే 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు మనదేశంలో సంపద పన్ను విధించేవారు. ప్రస్తుతం కరోనా దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. దాంతో మరోసారి సంపద పన్ను అంశం మన దేశంలోను తెరమీదికి వస్తోంది. సంపద పన్నును విధించినట్లయితే కరోనా కాటు నుంచి ఆర్థిక రంగం కూడా త్వరగా కోలుకుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.

వివిధ లెక్కల ప్రకారం మనదేశంలో అత్యంత సంపన్నులు 953 మంది ఉన్నారు. వారి యావరేజ్ సంపద 5, 278 కోట్ల రూపాయలని అంఛనా వారి మొత్తం ఆదాయాన్ని కలిపితే 50 లక్షల కోట్ల రూపాయలకు పైగానే వుంటుంది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి డబ్బుల్లో 190.5 లక్షల కోట్ల రూపాయలని అంఛనా. అంటే దేశ జాతీయ స్థూల ఉత్పత్తిని మనీలో లెక్కిస్తే అందులో అత్యంత సంపన్నుల వాటా జీడీపీలో 26.4 శాతంగా లెక్క తేలుతుంది.

వీరి సంపదపై జస్ట్ 4 శాతం పన్ను విధించినా మొత్తం జీడీపీలో ఒక్క శాతానికి పైగా డబ్బులు వసూలవుతాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 1.7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఈ మొత్తం జీడీపీలో ఒక శాతం కూడా కాదు. అత్యధిక ధనవంతులపై 4 శాతం పన్ను విధించినట్లయితే ఈ ఆర్థిక ప్యాకేజీ కన్నా ఎక్కువ డబ్బులే వసూలవుతాయి. పైగా నాలుగు శాతం పన్ను వారికే మాత్రం భారం కాదు. అందుకని ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం కూడా పరిశీలించాలని మేధావులు, ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. మరి తానే రద్దు చేసిన సంపద పన్నును తిరిగి తెచ్చేందుకు మోదీ సిద్దపడతారో లేదో వేచి చూడాలి.