AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై 94 ఏళ్ల అవ్వ విజయం

కుటుంబసభ్యలు తోడు లేకున్నా మహమ్మారిని తరిమికొట్టింది హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధురాలు. శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఆ వృద్ధురాలు.. గాంధీ వైద్యుల పర్యవేక్షణలో కరోనాపై విజయం సాధించింది.

కరోనాపై 94 ఏళ్ల అవ్వ విజయం
Balaraju Goud
|

Updated on: Jul 09, 2020 | 2:18 PM

Share

కనికరంలేని కరోనా మహమ్మారి కనిపించిన వారినల్లా కాటేసుంది. చిన్న పెద్ద తేడాలేకుండా అందరిని తన వశం చేసుకుంటోంది. కరోనాను జయించలేక చిన్నతనంలోనే అశువులు బాసిన వారు కొందరైతే, పండు వయసులో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కరోనా తరిమేస్తున్నవారు మరికొందరు. కుటుంబసభ్యలు తోడు లేకున్నా మహమ్మారిని తరిమికొట్టింది హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధురాలు. శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఆ వృద్ధురాలు.. గాంధీ వైద్యుల పర్యవేక్షణలో కరోనాపై విజయం సాధించింది.

హైదరాబాద్‌ చిక్కడపల్లికి చెందిన విజయలక్ష్మి (94) పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఇటీవల కరోనా సోకింది. వీటికి జ్వరం, దగ్గు తోడైంది. దీంతో కుటుంబసభ్యలు జూన్‌ 17న గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, కరోనా వైరస్‌ ధాటికి ఆమె చిన్న కుమారుడు బలి అయ్యాడు. కనిపెంచిన కొడుకు తన కళ్లముందే కాలం చేయడంతో మానసికంగా కుంగిపోయింది. అటు కోడలికీ కూడా కరోనా వైరస్ అంటుకుంది. పెద్ద కొడుకేమో విదేశాల్లో ఉంటున్నాడు. అసలే వయసు మీదపడి కాలం గడుపుతున్న ఆమె.. కరోనా వల్ల నా అనేవాళ్లు లేక ఒంటరిదైంది. అందరూ ఉండి కూడా అనాథగా మారింది. ఏం చేయాలో పాలుపోలేని స్థితికి చేరుకుంది.

శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఆ వృద్ధురాలు.. గాంధీ వైద్యులే దిక్కయ్యారు. అనుక్షణం డాక్టర్ల పర్యవేక్షణలో కరోనాను జయించింది. పేగుబంధం తోడుగా లేకున్నా.. డాక్టర్ల ప్రేమ, అనురాగాలు ఆమెను బ్రతికించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌నుంచి కోలుకున్నవారిలో అత్యధిక వయస్కురాలు ఆమే కావడం విశేషం. విజయలక్ష్మి ఆరోగ్యంపట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ప్రతిరోజు పరీక్షలు చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశామని గాంధీ సిబ్బంది తెలిపారు.

అయితే, గాంధీ ఆస్పత్రి వైద్యులు తీసుకున్న చొరవ అందరీ ప్రశంసలు పొందుతోంది. ‘నీకేం కాదమ్మా’ అంటూ ఆమెలో ధైర్యం నింపారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడితో రోజూ వీడియోకాల్‌లో మాట్లాడిస్తూ ఆమెలో మానసిక ధైర్యం నింపారు. వైద్యుల సూచనలు పాటిస్తూ, సమయానికి మందులు, సరియైన ఆహారం తీసుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో మంగళవారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. గాంధీ దవాఖానకు వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ రాజారావు తెలిపారు. కాగా, కరోనా సోకిన తనను వైద్యులు, నర్సులు చాలా బాగా చూసుకున్నారని విజయలక్ష్మి తెలిపారు. కరోనాను భయపడే వారికి ఈ అవ్వ చక్కని ఆదర్శం. కరోనా వైరస్ సోకిందన్న విషయాన్ని పక్కనబెట్టి మానసిక స్థైర్యంతో తట్టుకోగలిగితే కరోనాను జయించవచ్చని రుజువు చేస్తున్నారు.