కార్మికుల రాస్తారోకోలతో దద్దరిల్లిన విశాఖపట్నం.. గంటల తరబడి ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు రాస్తారోకోకు..
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు రాస్తారోకోకు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారుల దిగ్బంధం చేశారు. రాస్తారోకోకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. కేంద్రంపై ఉక్కు పిడికిలి బిగించింది. కార్మికులు, కర్షకులు.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వెనక్కి తీసుకునే వరకు.. తమ పోరు ఆగదని స్పష్టం చేశాయి.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కార్మికులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా దీక్షలు చేపట్టిన ఉద్యమకారులు శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరంలోని అన్ని రోడ్లపై బైఠాయించారు. జాతీయ రహదారిపై గాజువాక, ఇసుకతోట, మద్దిలపాలెం జంక్షన్ వద్ద నిరసనను వ్యక్తం చేశారు. రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు.. నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య పోలీసులకు ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.
నిన్నటి వరకు ఒక ఎత్తు.. ఇప్పుడు మరో ఎత్తు. సాగర తీరంలో ఉద్యమ కెరటాలు పోటెత్తాయి. నిన్నటి వరకు వందల్లో ఉన్న ఆందోళనకారుల సంఖ్య.. ఇప్పుడు వేలకు చేరింది. చేయి చేయి కలుస్తోంది. కలం.. గళం ఏకమౌతుంది. స్టీల్ సిటీ నుంచి స్టీల్ కంపెనీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేది ఊరుకునేది లేదని తేల్చి చెప్తున్నాయి. స్టీల్ సిటీ ఉక్కు పిడికిలి బిగించింది. కేంద్రంపై దండెత్తింది. ఊరు-వాడ ఏకమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మా బతుకుదెరువు.. మా ఆశల స్వప్నాన్ని ప్రైవేటు పరం చేయడానికి వీలులేదని తేల్చి చెప్తున్నాయి. స్టీల్ సిటీ పరిరక్షణ కమిటీ.. ఆధ్వర్యంలో విశాఖ కోదండపాలెం జంక్షన్‌లో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు ఆందోళనకారులు
అసలే కాక మీదున్న ఉద్యమం… ఆపై ప్రధాని పెట్రోల్ పోశారు. ఇక ఉద్యమకారులు ఊరుకుంటారా… ఉక్కు పిడికిలి బిగించారు. ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు స్టీల్ ఫైటర్స్. మండే ఉక్కు కణికల రగిలిపోతున్నారు. వేలాది మందికి జీవనాధారమైన స్టీల్ కంపెనీనిని ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉక్కును కాదు.. మా ప్రాణాలను అమ్ముకోండి అంటున్నారు ఉద్యమకారులు. పెద్ద ఎత్తున ప్లకార్డులతో వచ్చిన ఆందోళకారులు.. స్టీల్ సిటీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో.. అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో ఉద్యమం ఉధృతమైంది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరు.. హోరెత్తుతోంది. రిలే దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. విశాఖ వ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి కార్మికులు, ప్రజాసంఘాలు ర్యాలీ తీశారు. గాజువాక తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. గాజువాక యార్డులోనూ ట్రాన్స్‌పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. స్లాగ్ అండ్ బల్క్ మెటీరియల్ ట్రాన్స్‌పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ మేరకు మావోయిస్ట్ ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదలైంది. ఉక్కు పరిశ్రమని అందరం ఐక్యంగా ఉద్యమించి కాపాడుకుంటేనే 32మంది త్యాగానికి నివాళి తెలిపారు. బీజేపీ, వైసీపీ వేరైనప్పటికి వారు అమలు చేసే విధానాలు మాత్రం ఒక్కటే అంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
Read more:
నాటు సారా వ్యాపారంలో కొమరాడ తహశీల్దార్.. అక్రమ సంపాదన కోసం రెవెన్యూ అధికారి అడ్డదారి