Khairatabad Ganesha: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ రూపకల్పనకు అంకురార్పణ.. ఈసారి ఎలా ఉండబోతున్నారంటే..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ రూపకల్పనకు అంకురార్పణ జరిగింది. ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో నలభై అడుగుల ఎత్తులో రూపుదిద్దుకోనున్నాడు.

Khairatabad Ganesha: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ రూపకల్పనకు అంకురార్పణ.. ఈసారి ఎలా ఉండబోతున్నారంటే..
Khairatabad Ganesha As Sri Panchamukha Rudhra Maha Ganapathi
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 17, 2021 | 6:41 PM

Sri Panchamukha Rudhra Maha Ganapathi: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ రూపకల్పనకు అంకురార్పణ జరిగింది. గతేడాది ధన్వంతరి మహాగణపతి రూపంలో 14 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మట్టి గణనాథుడు ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో నలభై అడుగుల ఎత్తులో రూపుదిద్దుకోనున్నాడు. 67వ సారి భక్తుల పూజలందుకునేందుకు ముస్తాబువుతున్నాడు.

వినాయక చవితి వచ్చిందంటే తెలుగువారి మదిలో మొదటగా మెదిలేది ఖైరతాబాద్ వినాయకుడే. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ఖైరతాబాద్ గణపతి దర్శనమిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్ వినాయకుడు మరో ఘనత సాధించాడు. దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా అరుదైన గుర్తింపు సాధించింది. హైదరాబాద్ మహానగరంలోనే తలమానికంగా ఉండే ఖైరతాబాద్ మహాగణపతి రూపానికి సంబంధించి చిత్రాలను ఉత్సవ కమిటీ విడుదల చేసింది.

ఈసారి 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. గణనాథుడికి కుడి వైపు కృష్ణ కాళి, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారు 15 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నారు. ఐదు తలలతో దర్శనమివ్వనున్న మహాగణపయ్య.. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో రూపుదిద్దుకోనున్నాడు. ఈ రూపంలో వినాయకుణ్ని పూజిస్తే సకాలంలో వర్షాలు పడి, కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

గతేడాది కరోనాకు మందు రావాలని పూజలందుకున్న ధన్వంతరి మహా గణపతి.. ఈసారి కరోనా పూర్తిగా భూమి నుండి శాశ్వతంగా వెళ్లిపోవాలన్న సంకల్పంతో ఈ విగ్రహాల ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోట్ల మంది భక్తుల పూజలందుకొనున్న ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్రమహా గణపతి నవరాత్రి ఉత్సవాలను కేంద్రప్రభుత్వ కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

ఇదిలావుంటే, తొలిసారిగా 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఏర్పాటుచేసిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఏటా అడుగు చొప్పున పెంచుతూ 2014 నాటికి 60 అడుగులకు చేరింది. తర్వాత ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వచ్చినా అంతకు ముందు ఏడాది 61 అడుగులు భారీ విగ్రహాన్ని రూపొందించారు. అయితే, గతేడాది కరోనా మహమ్మారి కారణంగా 40 అడుగులతోనే తీర్చిదిద్దిన గణనాథుడు పూజలందుకున్నారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల నాటికీ విగ్రహ రూపుదిద్దుకోనుంది. ఖైరతాబాద్‌ గణేశుని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

అలాగే, ఖైరతాబాద్ వినాయకుని లడ్డూకూ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉంచే భారీ లడ్డూను ఏటా తాపేశ్వరానికి చెందిన భక్తుడు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు లడ్డూను ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. 2015 లో ఖైరతాబాద్ గణేష్ లడ్డూ బరువు 600 కిలోలు కాగా, గతేడాది సుమారు 6000 కిలోల లడ్డును తయారు చేశారు.

Read Also…  Garuda Puranam: ఈ ఐదు పనులూ చేస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుందని చెబుతోంది గరుడ పురాణం..అవి ఏమిటంటే..