కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వెంటాడుతోన్న సమయంలో ఎంతోమంది బయటకు వచ్చి పూట గడవనివారికి, వలస కూలీలకు సాయం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్నందున సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే..సాయం కంటే ఎక్కువ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు, పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విజయవాడ నగర వెస్ట్ జోన్ ఏసీపీ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 1వ తేదీన ఉదయం విజయవాడ నగరంలోని 2వ పట్టణ పీఎస్ పరిధిలో 47వ డివిజన్‌లోని గుజ్జారి యల్లారావు కూరగాయల మార్కెట్ ఎదురుగా టీడీపీ ఎంపీ కేశినేని నానితో పాటు ఆయన అనుచరులు కొందరు గవర్నమెంట్ రూల్స్ పాటించలేదని ప్రకటనలో పేర్కొన్నారు. కనీస భౌతిక దూరం పాటించకుండా పెద్ద ఎత్తున్న ప్రజలను జమచేసి ప్రాణాంతక కరోనా వ్యాధి వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తించి కూరగాయల పంపిణీ చేశారని ఏసీపీ పేర్కొన్నారు. కాబట్టి, ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి కరోనా వ్యాప్తి చెందేందుకు కారణమైన వారందరిపై విజయవాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుందు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అయితే విజయవాడ సిటి పోలీసులకు ఎంపీ కేశినేని తీవ్రంగా ఫైరయ్యారు. తిండి లేక అలమటిస్తున్న పేదలకు సహాయం చేస్తునందుకు విజయవాడ పోలీసులు దొంగ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకుంది వారు ఆపదలో ఉన్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదని చురకలంటించారు.
కరోనా విపత్తు లో తిండి లేక అలమటిస్తున్న పేదలకుసహాయం చేస్తునందుకు దొంగ కేసులు బనాయించిన @VjaCityPolice వారికి ధన్యవాదాలు మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదు ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడం ఆపేది లేదు ప్రజలు ఎన్నుకొన్నది వారు ఆపదలో వున్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదు pic.twitter.com/oZVlk4LRYB
— Kesineni Nani (@kesineni_nani) May 2, 2020