గొప్ప రాజనీతిజ్ఞుడిని భారత దేశం కోల్పోయింది…

మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణం తనను కలిచివేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. భారతమాత ప్రియపుత్రుడు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో దేశ రాజకీయాల్లో అంచెలంచెలుగా...

గొప్ప రాజనీతిజ్ఞుడిని భారత దేశం కోల్పోయింది...
Venkaiah Naidu
Follow us

|

Updated on: Aug 31, 2020 | 7:24 PM

మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణం తనను కలిచివేసిందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. భారతమాత ప్రియపుత్రుడు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో దేశ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆదర్శనీయులు. సుదీర్ఘమైన, విశిష్టమైన ప్రజాజీవితంలో చేపట్టిన ప్రతి పదవికి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు వన్నె తీసుకువచ్చారు అని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

పరిపాలనా చతురతలోనూ, సమస్యల పరిష్కర్తగానూ పేరు సంపాదించుకున్న ఆయనకు భారత పార్లమెంటరీ వ్యవస్థ మీద లోతైన అవగాహన ఉంది. భారతదేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖల కేంద్ర మంత్రిగానే గాక ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ లాంటి అనేక కీలక పదవులను ఆయన నిర్వహించారు. రాష్ట్రపతిగానూ ప్రజలతో మమేకం కావడానికి ఆయన ప్రయత్నించారు.

పార్లమెంటరీ ప్రక్రియలు, సమాకాలీన రాజకీయాలే గాక అనేక విషయాలకు సంబంధించిన ఎన్ సైక్లోపీడియాగా ప్రణబ్‌ని పిలిచే వారు. మంచి పార్లమెంట్ సభ్యునిగా, నైపుణ్యం కలిగిన వక్తగా అందరినీ ఆకర్షించేవారు. అసాధారణ జ్ఞాపకశక్తి, సమస్యను లోతుగా, భిన్న కోణాల్లో విశ్లేషించగల నేర్పుతో భారతీయ ప్రజాస్వామ్యం మరియు సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కృషి చేశారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. అందరివాడుగా, ఏకాభిప్రాయాన్ని సాధించే నేర్పు కలవారిగా దేశ రాజకీయ యవనికపై తనదైన ముద్రవేశారని అన్నారు.

ప్రణబ్ ముఖర్జీ మరణంతో భారతదేశం మరో అత్యున్నత నాయకుణ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఉప రాష్ట్రపతి.