ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్ గురించి తెలుసా..?
అమెరికా వీసా గడువుపై యూఎస్ ఎంబసీ కొత్త స్పష్టతనిచ్చింది. వీసా ఎక్స్‌పైరీ కాకుండా I-94 ఫారమ్‌లోని Admit Until Date మాత్రమే అమెరికాలో బస చేసే వ్యవధిని నిర్ణయిస్తుందని తెలిపింది. ట్రంప్ ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలను విస్తరిస్తూ, వలస నిబంధనలను కఠినతరం చేసింది. భారతీయులు ఈ నిబంధనలను తప్పక పాటించాలి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. తాజాగా అమెరికా సందర్శించే అంతర్జాతీయ ప్రయాణికులకు, ముఖ్యంగా భారతీయులకు యూఎస్ ఎంబసీ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. మీరు అమెరికాలో ఎంతకాలం ఉండవచ్చనేది మీ వీసాపై ఉన్న గడువు తేదీ నిర్ణయించదని స్పష్టం చేసింది.
ఏది అసలైన గడువు?
చాలా మంది తమ వీసాపై ఉన్న Expiry Date వరకు అమెరికాలో ఉండవచ్చని భావిస్తారు. కానీ యూఎస్ ఎంబసీ దీనిపై స్పష్టతనిస్తూ.. మీరు అమెరికా చేరుకున్నాక యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారి అనుమతించిన తేదీ వరకు మాత్రమే ఉండాలని తెలిపింది. ప్రయాణికులు తమ బస వ్యవధిని తెలుసుకోవడానికి I-94 ఫారమ్ లోని Admit Until Dateని చెక్ చేయాలి. వీసా గడువు ఉన్నప్పటికీ, I-94లో ఇచ్చిన తేదీ దాటితే అది చట్టవిరుద్ధం అవుతుంది. ప్రయాణికులు i94.cbp.dhs.gov వెబ్‌సైట్‌లో తమ అడ్మిషన్ నంబర్ లేదా ట్రావెల్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చు.
ట్రంప్ ప్రయాణ నిషేధం.. కొత్తగా 5 దేశాలు
మరోవైపు ట్రంప్ ప్రభుత్వం తన ట్రావెల్ బ్యాన్ పరిధిని విస్తరించింది. బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా దేశాల పౌరులపై అమెరికా ప్రయాణ నిషేధాన్ని విధించింది. పాలస్తీనా జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. నైజీరియా, సెనెగల్, టాంజానియా, జాంబియా వంటి మరో 15 దేశాలపై పాక్షిక పరిమితులు విధించారు. మోసపూరిత వలసలను అరికట్టేందుకు కుటుంబ ఆధారిత వలస వీసా కేటాయింపులను కూడా తగ్గిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
I-94 ఎవరికి అవసరం?
అమెరికా పౌరులు కాని ప్రతి ప్రయాణికుడికి I-94 రికార్డ్ తప్పనిసరి. వాయు, సముద్ర మార్గంలో వచ్చేవారికి ఇది ఆటోమేటిక్‌గా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జారీ అవుతుంది. భూమార్గం ద్వారా వచ్చేవారు సమయం ఆదా చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో ముందుగానే తాత్కాలిక I-94 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




