కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారుల ప్రతిజ్ఞ

రోజు రోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడోస్తుందా అని జనం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ప్రయోగాల వ్యవధిని తగ్గించి సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని తయారీ సంస్థలపై ఒత్తిడి పెరిగింది.

కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారుల ప్రతిజ్ఞ
Follow us

|

Updated on: Sep 10, 2020 | 8:12 AM

ప్రపంచాన్ని కుదేపేస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శాస్త్రవేత్తలు కుస్తీపడుతున్నారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం కంపెనీలు పోటీపడుతున్నాయి. రోజు రోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడోస్తుందా అని జనం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ప్రయోగాల వ్యవధిని తగ్గించి సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని తయారీ సంస్థలపై ఒత్తిడి పెరిగింది. ఈ రేసులో కంపెనీలు తొందరపడితే సురక్షితమైన వ్యాక్సిన్‌, దాని సమర్థతపై ప్రభావం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పోటీలో ఉన్న వ్యాక్సిన్‌ కంపెనీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. వ్యాక్సిన్‌ తయారీకి ఉన్న శాస్త్రీయ ప్రమాణాలకే తాము కట్టుబడి ఉంటామని అమెరికా, యూరప్‌కు చెందిన వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థలు సంయుక్త ప్రకటన చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీకి ఉన్న శాస్త్రీయ ప్రక్రియ సమగ్రతకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశాయి. వ్యాక్సిన్ అనంతరం వెలువడే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మందును మార్కెట్ లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆస్ట్రాజెనికా, ఫైజర్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌తో పాటు జాన్సన్‌ & జాన్సన్‌, మెర్క్&కో, మోడెర్నా, నోవావాక్స్‌, సనోఫి, బయోఎన్‌టెక్‌ మొత్తం తొమ్మిది వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఈ ప్రకటన చేశాయి. అయితే, క్లినికల్‌ ట్రయల్స్‌లో అత్యున్నత శాస్త్రీయ పద్ధతులు, నైతిక ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పడంలో భాగంగానే ఈ ప్రతిజ్ఞ చేసినట్లు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.