యూపీ లోని బుదౌన్ లో మత గురువు అంత్య క్రియల్లో పాల్గొన్న వేలాది జనం, ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ లోని బుదౌన్ లో ఓ మత గురువు అంత్యక్రియలకు వేలమంది జనం మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా హాజరు కావడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు.
ఉత్తరప్రదేశ్ లోని బుదౌన్ లో ఓ మత గురువు అంత్యక్రియలకు వేలమంది జనం మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా హాజరు కావడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ నెల 9 న అబ్దుల్ హమీద్ మహమ్మద్ సలిముల్ ఖాద్రి అనే మతగురువు మరణించారు. అయితే నిన్న జరిగిన ఆయన అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు, ప్రజలు హాజరయ్యారు. వారిలో ఎవరూ మాస్కుల జోలికి పోలేదు. ఇన్ని వేలమంది పాల్గొన్న ఈ దృశ్యం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోవిద్ ప్రోటోకాల్ ఏ మాత్రం పాటించకుండా జరిగిన ఈ ఊరేగింపునకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలని యూపీ పోలీసులు నిర్ణయించారు. ఇందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించారు..ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద వీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. బుదౌన్ లో సుమారు 3 వేల కోవిద్ కేసులు నమోదయ్యాయి. 80 మందికి పైగా కోవిడ్ రోగులు మరణించారు. అయినా ఈ కోవిడ్ మహమ్మారి అదుపునకు ప్రభుత్వం నిర్దేశించిన గైడ్ లైన్ ను ఖాతరు చేయకుండా ఇంత భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడాన్ని ప్రభుత్వం అసాధారణమైన, తీవ్ర ఘటనగా పరిగణించింది.
కాగా ఖాద్రి అంత్యక్రియల్లో ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని జిల్లా అధికారులకు ముందే తెలుసునని, కానీ వారు ఉదాసీనంగా వ్యవహరించారని స్థానికుడొకరు చెప్పారు. వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఇంతమంది హాజరు కాకపోయి ఉండేవారని ఆయన అభిప్రాయపడ్డాడు. అసలు ఈ నెల 9 వ తేదీనే ఖాద్రి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఓ హాలులో ఉంచారని, అప్పుడే భారీ సంఖ్యలో ఆయన అభిమానులు హాజరయ్యారని ఆ స్థానికుడు చెప్పాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Police Case on Babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై గుంటూరు జిల్లాలో కేసు నమోదు.. కారణమేంటంటే..
Police Case on Babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై గుంటూరు జిల్లాలో కేసు నమోదు.. కారణమేంటంటే..