నేటి నుంచి శ్రీవారి సుప్రభాత సేవలు మొదలు.. నెలరోజుల తర్వాత భక్తులకు అనుమతి.. ఇవాళ తిరుమలలో గోదాదేవి పరిణయోత్సవాలు

శ్రీవారి ఆలయంలో నెలరోజుల తర్వాత సుప్రభాత సేవలు ప్రారంభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:48 am, Fri, 15 January 21
నేటి నుంచి శ్రీవారి సుప్రభాత సేవలు మొదలు.. నెలరోజుల తర్వాత భక్తులకు అనుమతి.. ఇవాళ తిరుమలలో గోదాదేవి పరిణయోత్సవాలు

తిరుమల శ్రీవారికి శుక్రవారం నుంచి తిరిగి సుప్రభాత సేవలు మొదలయ్యాయి. ధనుర్మాసం ముగియడంతో శ్రీవారి ఆలయంలో నెలరోజుల తర్వాత సుప్రభాత సేవలు ప్రారంభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే, ఇవాళ శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవాలు జరగనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 16 నుంచి సుప్రభావత సేవ నిలిచిపోయింది. ధనుర్మాసం ఈ నెల 14తో ముగిసింది. దీంతో తిరిగి శుక్రవారం నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు ప్రారంభమయ్యాయి. వేకువజామున 3 గంటలకు సుప్రభాత పఠనం సమయంలో భక్తులనూ అనుమతించారు.

జనవరి 14న ధనుర్మాసం పూర్తికావడంతో గోదా కళ్యాణం నిర్వహించారు. ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరిగాయి. శ్రీవారి ఆలయంలో నెలరోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో గోదాదేవి రచించిన 30 పాశురాలను అర్చకులు రోజుకొకటి చొప్పున నివేదించారు. ఈ సందర్భంగా భోగశ్రీనివాసమూర్తికి బదులు శ్రీకృష్ణస్వామికి ఏకాంతసేవ నిర్వహించారు.

ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు శ్రీవారికి తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురణాల్లో పేర్కొన్నారు.

భారత ప్రజాస్వామ్య వైభవం ప్రతిభింబించేలా రాజ్యాంగ మందిరం.. ఇవాళ్టి నుంచి భవన నిర్మాణం పనులు షురూ