కామారెడ్డి ఆర్డీవోతో సహా మరో ఇద్దరిపై వేటు
రెవెన్యూ అధికారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయలను దండుకుంటున్నారు.
రెవెన్యూ అధికారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. కీసర తహసీల్దార్ నాగరాజు,, మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ అవినీతి బాగోతం మరవకముందే.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మంగళవారం మరో భూబాగోతం వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు ఏకంగా రూ. 80 కోట్ల విలువైన అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారు. పైగా చనిపోయిన తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కుట్రకు తెర తీశారు. ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు పెట్టుకోవడంతో.. అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఈ కేసుకు సంబంధం ఉన్న ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ సహా మరొకరిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లో తాసిల్దార్ గా పనిచేసిన సమయంలో దస్త్రాలను ఖాజిపల్లి లోని రూ.కోట్ల విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉందన్న జిల్లా కలెక్టర్ విచారణలో వెల్లడైంది. ఈ నివేదిక ఆధారంగా కామారెడ్డి ఆర్డీవో నరేందర్ తో పాటు డిప్యూటీ తహసీల్దార్ కె. నారాయణ, ఖాజీపల్లి వీఆర్వో జే. వెంకటేశ్వర్రావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఐదుగురు ఉద్యోగులపై డిపార్ట్మెంటల్యాక్షన్ తీసుకోవాలని, భూమిని పొందేందుకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్‌కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
జిన్నారం తహసీల్దార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2013లో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల తహసీల్దార్‌గా పనిచేసిన నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ, ఖాజిపల్లి వీఆర్వో వెంకటేశ్వర్రావు కలిసి ఖాజీపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్181లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాతంత్ర సమరయోధుల కోటాలో ఎన్. నాగేంద్ర రావు, తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎం.మధుసూదన్ అనే నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున అసైన్మెంట్ కింద కేటాయించినట్టు నకిలీ పట్టాలు తయారు చేశారు. అందుకనుగుణంగా రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేశారు. కొన్నాళ్ల క్రితం నలుగురిలో ఒకరైన నాగేంద్రరావు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో సమర్పించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అవి సరైనవి కావని అనుమానించారు. ఈ మేరకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌తో ఎంక్వైరీ చేయించారు. ఆయన విచారణ జరిపి నలుగురు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని అక్రమంగా కేటాయించినట్టు, రికార్డుల్లో దిద్దుబాట్లు చేసినట్టు తేల్చారు.
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సూచన మేరకు అప్పటి జిన్నారం తహసీల్దార్ నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్వో వెంకటేశ్వర్రావు మీద గత నెల 14న జిన్నారం తహసీల్దార్ ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల17న కేసు(ఎఫ్ఐఆర్ నం.115/2020) నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవోగా పనిచేస్తున్న నరేందర్ ముందస్తు బెయిల్ కోసం మెదక్ 8వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.