కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వరంగల్ ఎమ్మెల్యేలు… తెలంగాణను ఎడారిగా మార్చాలని చూస్తున్నారని విమర్శ…

కేంద్ర ప్రభుత్వంపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వరంగల్ ఎమ్మెల్యేలు... తెలంగాణను ఎడారిగా మార్చాలని చూస్తున్నారని విమర్శ...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 24, 2020 | 3:23 PM

కేంద్ర ప్రభుత్వంపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చి రైతుల పొట్టకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కేంద్రం తను చేస్తున్న కుట్రలను ఆపకపోతే పోరు తప్పదని హెచ్చరిస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మా నీళ్లు మేం వాడుకోవద్దని చెప్పడానికి కేంద్రానికి హక్కెక్కడిదని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు పర్చకపోతే ఏం చేస్తారని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3వ టీఎంసీ నీటి వినియోగం, దేవాదుల పనులను ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ లేఖలు పంపడాన్ని ఖండించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల29న నిరసన దీక్షలకు పిలుపు నిచ్చారు. అవసరం అయితే కేంద్రంతో యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్న దేవాదుల ఫేజ్ 3 పనులను ఆపాలని చెప్పడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పరుష పదజాలంతో కేంద్రంపై దూషణలకు దిగారు.