TIGER FEAR IN TELANGANA: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం.. ఆవుపై దాడి.. భయాందోళనలో ప్రజలు..
తెలంగాణ వ్యాప్తంగా పులల సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. మొన్న ఆదిలాబాద్, నిన్న ఆసిఫాబాద్, నేడు భద్రాద్రి కొత్తగూడెం.. ఇలా రోజుకో జిల్లాలో..
తెలంగాణ వ్యాప్తంగా పులల సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. మొన్న ఆదిలాబాద్, నిన్న ఆసిఫాబాద్, నేడు భద్రాద్రి కొత్తగూడెం.. ఇలా రోజుకో జిల్లాలో పులి సంచారం వార్త అక్కడి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం అనిషెట్టిపల్లి గ్రామం గుళ్లమడుగు సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గుళ్లమడుగు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ఆవుపై పులి దాడి చేసింది. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు పులి సంచారానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. పులి పాద ముద్రల ఆధారంగా అది ఎటువైపునకు వెళ్లిందనే దానిపై గాలింపు చేపట్టారు. కాగా, పులి సంచారం నేపథ్యంలో అనిషెట్టిపల్లి గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇళ్ల నుంచి ఒంటరిగా బయటకు రావడానికి జంకుతున్నారు. పులిని బందించాలని అటవీ అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు.
ఇదిలాఉండగా, ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పుష్కరవనంలో పులి సంచరించింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు, తనకు రోడ్డు దాటుతున్న పులి కనిపించిందని అటవీశాఖాధికారులకు సమాచారం అందించాడు. దాని ఆధారంగా అటవీ అధికారులు ఆధారాలు సేకరించగా.. సదరు వ్యక్తి చెప్పింది నిజమే అని తేల్చారు. ఇప్పుడు మరోసారి పులి సంచారం అక్కడ కలకలం రేపుతోంది.
Also Read:
నేటి అమావాస్యకి ఓ ప్రత్యేకత ఉంది.. కోటి సూర్య గ్రహణములతో సమానమైన సోమావతి అమావాస్య.. ఇలా చేయండి..