AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Importance of Sankranti : మకర సంక్రాంతి అంటే ఏమిటి..? ఈరోజుని పెద్దల పండుగని ఎందుకు అంటారో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. మన దేశంలోని హిందువులే కాదు.. విదేశాల్లో ఉండే వారు కూడా సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సూర్యుడి గమనాన్ని సూచిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి..

Importance of Sankranti :  మకర సంక్రాంతి అంటే ఏమిటి..? ఈరోజుని పెద్దల పండుగని ఎందుకు అంటారో తెలుసా..?
Surya Kala
|

Updated on: Jan 13, 2021 | 11:04 AM

Share

Importance of Sankranti :తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. మన దేశంలోని హిందువులే కాదు.. విదేశాల్లో ఉండే వారు కూడా సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సూర్యుడి గమనాన్ని సూచిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు

సంక్రాంతి అంటే ఒక్కరోజులో హడావిడిగా జరిగిపోయే పండగ కాదు. మూడ్రోజుల మురిపెం అంత కన్నా కాదు. రావటానికి నెల, పోవటానికి నెల సమయం తీసుకునే పండగ. ఆ గమనాగమన కాలమంతా తన జ్ఞాపకాలను, సన్నాహాలను ఒక వ్యాపకంగా మార్చేసే పండగ. ధనుర్మాసం ప్రారంభంతోనే సంక్రాంతి ఆగమన ఆనవాళ్లు మన కళ్లకు కడతాయి. ముంగిళ్లు అందమైన ముగ్గులతో పరవశిస్తాయి. సంక్రాంతి విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..!

హేమంత రుతువులో మార్గశిర మాసపు శీతగాలులు… మంచు కురిసే వేళలు… ఇదే తరుణంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే మకర సంక్రాంతి. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటాం. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో, మకర రాశిలోకి అడుగుపెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి..

సంక్రాంతి తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైందే. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్‌లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాల్లో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘి అని పిలుస్తారు. పేరేదైనా ఈ పండుగకు సందర్భమూ, సంతోషానికి కారణాలు అన్ని చోట్లా ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండుగే. కళ్లం నుంచి ఎడ్ల బళ్లమీద ధాన్యం ఇంటికి చేరే సరికి రైతు కళ్లు ఆనందంతో మెరుస్తుంటాయి. అందుకే ఆ రోజులు నిజంగా పండుగే. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు.

తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల ముందునుంచే పండుగ సందడి మొదలవుతుంది. పండుగ రోజుల్లో ఇంటిముందు రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గొబ్బెమ్మలు పెడతారు. ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం. నెలరోజుల పాటు తన హరినామ సంకీర్తనతో అలరించే హరిదాసు ఈరోజు భక్తులు ఇచ్చే బహుమతులను సంతోషంగా స్వీకరిస్తారు. హరిణి కీర్తిస్తూ వచ్చే హరిదాసు సాక్షాత్ కృష్ణుడే ఈ రూపంలో వస్తాడని పూర్వీకులు భావించేవారు.

అందమైన ఈ దృశ్యాలు చూడ్డానికి రెండు కళ్లు చాలవు.. పగటి వేషాలు, డోలు, సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, బుడబుక్కలవాళ్ల, ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తారు. ఇక కోళ్లపందాలు, ఎడ్లపందాలు పండుగకు మరింత సందడి తెస్తాయి.

ఈ పండగ ప్రత్యేక ఏమిటంటే.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. గంగిరెద్దులను చక్కగా అలంకరించి ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటితో చేయించే నృత్యాలు బాహురమణీయంగా ఉంటాయి. గంగిరెద్దులు పండుగ బహుమానంగా బట్టలు పిండివంటలు.. ధ్యాన్యం ఇస్తే.. అవి కృతజ్ఞతగా తలలు ఊపే దృశ్యం చూడచక్కనైంది. అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు చేసే సందడి అంతాఇంతాకాదు..కాలక్రమంలో గంగిరెద్దులాట మాయమైపోతుంది.. కొంతమంది ఇళ్లలో బొమ్మల కొలువును తీర్చిద్దితారు పురాణ హితిహాసాలతో కూడిన బొమ్మలను కొలువుగా ఏర్పాటు చేసి పిల్లలు పెద్దలు సందడి చేస్తారు.

ఇక ఏడాదిలో ఏరోజూ వాడని నల్ల నువ్వుల్ని సంక్రాంతినాడు తిలతర్పణం పేరుతో పితృదేవతలకు సమర్పిస్తారు. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఈ పండుగ ఏటా దాదాపు జనవరి 14నే రావడం. దీనికి ప్రధాన కారణమేమంటే… హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి కాబట్టి మనం అనుసరిస్తున్న గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈ పండుగలు వేర్వేరు తేదీల్లో వస్తాయి. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది. అందుకే ఈ పండుగ జరుపుకునే తేదీల్లో దాదాపుగా మార్పు ఉండదు. మన సంప్రదాయంలో పండుగలను కాలానుగుణంగా జరుపుకుంటాం.. ప్రతి పండుగ వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయని నేటి పరిస్థితి మనకు తెలియజేస్తుంది. మన ఆచార, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ మీ టీవీ 9 అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుంది.

Also Read: భోగి మంటలెందుకు?.. భోగి పళ్ళ వేడుకల వెనుక ఉద్దేశ్యమేంటి?.. మన సంప్రదాాయాల వెనుక అంతరార్ధం ఇదే..