హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ కోహెడ పండ్ల మార్కెట్..అతి త్వరలోనే అందుబాటులోకి..
హైదరాబాద్ శివారులోని కోహెడలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని అత్యంత ఆధునిక వసతులతో ఈ మార్కెట్ రూపుదిద్దుకుంటోంది. ఈ మెగా ప్రాజెక్ట్ మొదటి దశను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని, అలాగే పూర్తిస్థాయి మార్కెట్ నిర్మాణాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల అవసరాలు, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా కోహెడలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని దాదాపు 239 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ మార్కెట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఆసియాలోనే అత్యంత ఆధునిక ప్రమాైకలతో కూడిన పండ్ల మార్కెట్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ పురోగతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీచించిన ఆయన, నిర్మాణ పనులకు సంబంధించి స్పష్టమైన గడువులను నిర్దేశించారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి దశ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని, అలాగే 2028 జూన్ 2 నాటికి మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని, ఒకవేళ పనుల్లో జాప్యం జరిగితే కాంట్రాక్ట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను సవరించాలని సూచించారు. అంతేకాకుండా, ఈ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులు:
కొత్తపేట గడ్డిఅన్నారం మార్కెట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా వస్తున్న ఈ కోహెడ మార్కెట్‌ను ఫ్రాన్స్‌లోని ప్రముఖ రంగిస్ మార్కెట్ తరహాలో అత్యున్నత వసతులతో డిజైన్ చేస్తున్నారు. పండ్ల నిల్వ కోసం అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, భారీగా విక్రయాలు జరిపేందుకు వీలుగా ట్రేడింగ్ హాళ్లు, దేశీయ, అంతర్జాతీయ రవాణాకు అనుకూలమైన రోడ్డు కనెక్టివిటీ వంటి సమగ్ర మౌలిక సదుపాయాలు ఇందులో కల్పిస్తున్నారు.
ఈ మార్కెట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణ రైతులు తమ ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు గొప్ప వేదిక లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో రైతులు, వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.




