ఇళ్లపై కోతుల బెడదతో విసిగిపోయారా? టెర్రస్, నీటి ట్యాంక్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈజీ చిట్కాలు!
ఇళ్ల మీదకు వచ్చే కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పైకప్పుపై ఉండే నీటి ట్యాంకులు, ఉతికిన బట్టలు, ఆహార పదార్థాలను కోతులు పాడు చేస్తుంటాయి. ట్యాంకుల మూతలను తెరిచి నీటిని కలుషితం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని నివారించడానికి వాటర్ ట్యాంక్‌కు గట్టి తాళాలు వేయాలి. కోతులను కర్రలతో కొట్టడం లేదా రాళ్లతో కొట్టడం వంటివి చేయకూడదు, ఎందుకంటే అవి తిరిగి దాడి చేసే ప్రమాదం ఉంది. సమస్య తీవ్రంగా ఉంటే అటవీ శాఖ అధికారులను సంప్రదించాలి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నివాస గృహాల మీదకు గుంపులుగా వచ్చే కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇవి ఆరు బయట, మెడమీద ఆరబెట్టిన బట్టలను చించేయడమే కాకుండా, పైకప్పుపై ఉండే నీటి ట్యాంకుల మూతలను పీకి పారేస్తుంటాయి. దీనివల్ల తాగునీరు కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఆహార పదార్థాల కోసం ఇళ్లలోకి చొరబడటం వంటి ఘటనలు కలవరపెడుతున్నాయి. మీ ఇంటిపై కూడా కోతుల రాకతో ఇబ్బందులు పడుతుంటే, కొన్ని సులభమైన భద్రతా చర్యలు పాటించడం ద్వారా వాటి ఉనికిని గణనీయంగా తగ్గించవచ్చు.
నీటి ట్యాంక్‌ను సురక్షితంగా ఉంచడం ఎలా?
చాలా మంది ఇళ్లలో నీటి ట్యాంక్ మూతలను సరిగ్గా బిగించరు. దీనిని ఆసరాగా చేసుకునే కోతులు సులభంగా మూత తెరిచి నీటిని పాడు చేస్తుంటాయి. కాబట్టి, వాటర్ ట్యాంక్ మూతకు బలమైన హుక్, లాక్ లేదా తాళం వేయడం అత్యంత ముఖ్యం. అలాగే ట్యాంక్ చుట్టూ బలమైన ఇనుప మెష్ లేదా వైర్ జాలీని అమర్చితే కోతులు ట్యాంక్ దగ్గరికి రాకుండా నిరోధించవచ్చు.
టెర్రస్‌పై కోతులు వాలకుండా తగు జాగ్రత్తలు:
టెర్రస్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు లేదా అచ్చులు ఆరబెట్టడం చేయకండి. ఆహార వాసన కోతులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇంటి పైకప్పుపై లేదా బాల్కనీలో చెత్త డబ్బాలను ఎప్పుడూ మూత పెట్టి ఉంచాలి. బహిరంగంగా వ్యర్థాలు ఉంటే కోతులు గుమిగూడతాయి. కోతులు ఎక్కువగా ఏ మార్గం ద్వారా పైకి వస్తున్నాయో గుర్తించి, ఆ ప్రాంతంలో బలమైన ఇనుప గ్రిల్స్ లేదా రక్షిత బ్యారియర్లను ఏర్పాటు చేయాలి.
చేయకూడని తప్పులు:
కోతులను తరిమికొట్టే పేరుతో వాటిపై రాళ్లు విసరడం, కర్రలతో కొట్టడం లేదా మిర్చి పౌడర్ చల్లడం వంటి పనులకు పాల్పడకండి. ఇవి కోట్లను మరింత ఉద్రేకపరిచి, అవి మీపై దాడి చేసేలా చేస్తాయి. అలాగే వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినిపించకూడదు. ఒకవేళ కోతుల గుంపు వల్ల తీవ్రమైన సమస్య ఏర్పడితే, మీ ప్రాంతంలోని స్థానిక పురపాలక సంఘం అధికారులను లేదా అటవీ శాఖ సిబ్బందిని సంప్రదించి సహాయం తీసుకోవడం మంచిది. సరైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోతుల వల్ల జరిగే నష్టాన్ని సులభంగా నివారించవచ్చు.




