ముచ్చింతల్‌లో ముగిసిన యతీంద్ర సప్తతి వేడుకలు.. 1,001 కలశాలతో శ్రీరాముడికి అభిషేకం!
Chinna Jeeyar Swamy 70th Birthday celebrations: ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరిగిన చిన్న జీయర్ స్వామివారి 70వ యతీంద్ర సప్తతి వేడుకలు ఐదు రోజులపాటు భక్తి, సమాజ సేవ, వైదిక సంస్కృతికి అద్దం పట్టాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం గిన్నిస్ రికార్డు సృష్టించగా, పురస్కార ప్రదానాలు, తిరుప్పావై పుస్తకావిష్కరణ ఆకట్టుకున్నాయి. కోదండ రామచంద్ర స్వామివారికి ఏకోత్తర సహస్ర కలశాభిషేకంతో ఈ మహోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి.

ఐదు రోజుల పాటు ముచ్చింతల్ శ్రీరామనగరంలో సాగిన యతీంద్ర సప్తతి వేడుకలు.. చివరిరోజు శ్రీకోదండ రామచంద్ర స్వామివారికి నిర్వహించిన ఏకోత్తర సహస్ర కలశాభిషేకంతో పరిపూర్ణతను సంతరించుకున్నాయి. వేదమంత్రాల నడుమ.. 1,001 కలశాల పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భక్తి సంప్రదాయానికి, వైదిక సంస్కృతికి అద్దంపట్టిన ఈ మహత్తర క్రతువుతో ఐదు రోజుల ఉత్సవాలకు మంగళకరమైన ముగింపు లభించింది. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామివారి చేతుల మీదుగా తిరుప్పావై పుస్తకావిష్కరణ జరిగింది. గోదాదేవి భక్తి తత్త్వాన్ని, తిరుప్పావైలోని ఆధ్యాత్మిక సందేశాన్ని మరింతమందికి చేరువ చేసే మరో ప్రయత్నంగా ఈ ఆవిష్కరణ నిలిచింది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆచార్యుల జన్మదిన వేడుక.. కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు.. సమాజానికి ఒక సందేశంగా, సేవకు ఒక గుర్తింపుగా, ఆధ్యాత్మికతకు ఒక వేదికగా రూపుదిద్దుకుంది.
- మొదటి రోజు.. సనాతన వేద విజ్ఞానాన్ని పరిరక్షిస్తున్న పండితులకు, ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు జీయర్ పురస్కారాల ప్రదానంతో మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సేవకు గౌరవం అందించారు.
- రెండో రోజు.. ఆచార్య వైభవాన్ని ఆవిష్కరించారు. గురు పరంపర గొప్పతనాన్ని, ఆచార్యుల మార్గదర్శకత్వ ప్రాధాన్యతను స్మరించుకున్నారు.
- మూడో రోజు.. పదివేల గొంతులు ఒక్కటై మార్మోగించిన శ్రీ విష్ణు సహస్రనామ విరాట్ పారాయణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ నిర్వహించిన మంగళ తరంగిణి కార్యక్రమం ఆధ్యాత్మిక సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసింది.
- నాలుగో రోజు.. దేశ రక్షణలో అసమాన సేవలందించిన Army, Navy, Airforce అధికారులకు, విజ్ఞాన రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు సమతా పురస్కారాలతో గౌరవం అందించారు.
- అదేరోజు సాయంత్రం సమాజ సేవలో తమ జీవితాలను అంకితం చేసిన మాతృమూర్తులను సత్కరించి.. మహిళా శక్తికి వందనం సమర్పించారు.
- ఇక ఐదో రోజు.. శ్రీకోదండ రామచంద్ర స్వామివారికి ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించి మహోత్సవాలకు సంపూర్ణత చేకూర్చారు.
ఈ సందర్భంగా 1993లో శ్రీరామచంద్ర స్వామివారి విగ్రహాలు అదృశ్యమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు స్వామీజీ. అయితే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తిరిగి ఆశ్రమానికి చేరడంలో కీలక సహకారం అందించిన అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు సేవలను చిన్న జీయర్ స్వామివారు కృతజ్ఞతతో స్మరించుకున్నారు. ఆయన చేతుల మీదుగానే 32 ఏళ్లుగా ప్రతి ఏకొత్తర సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతున్న విషయాన్ని పంచుకున్నారు.
భక్తికి అక్షర రూపం.. ఆరాధనకు ఆధ్యాత్మిక పరిమళం తిరుప్పావై. గోదాదేవి రచించిన ఈ దివ్య పాశురాలు భగవంతుడి పట్ల శరణాగతి భావాన్ని, భక్తి తత్త్వాన్ని చాటిచెబుతాయి. అలాంటి పవిత్ర తిరుప్పావై పుస్తకాన్ని చివరి రోజు వేడుకల్లో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారు ఆవిష్కరించారు. భక్తి సారాన్ని భావితరాలకు చేరువ చేసే మరో ఆధ్యాత్మిక ప్రయత్నమిది.
ఇలా ఐదు రోజుల పాటు సాగిన యతీంద్ర సప్తతి.. ఒక జన్మదిన మహోత్సవాన్ని మించి ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక సందేశాలను అందించింది. భగవంతుడి ఆరాధనలో భక్తి.. గురువుల బోధనలో జ్ఞానం.. సమాజ సేవలో మానవత్వం.. ఈ మూడింటి సమన్వయమే ఈ వేడుకల అంతరార్థంగా నిలిచింది.
