నీట్ పరీక్షలో తెలంగాణ విద్యార్థుల హవా

తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో మరోసారి తమ సత్తా చాటారు. జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు సంచలన ఫలితాలను నమోదు చేశారు

నీట్ పరీక్షలో తెలంగాణ విద్యార్థుల హవా
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 17, 2020 | 10:57 AM

తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో మరోసారి తమ సత్తా చాటారు. జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)లో ఇద్దరు విద్యార్థులు సంచలన ఫలితాలను నమోదు చేశారు. ఇద్దరికీ సమానంగా.. 720 మార్కులకు గానూ 720 మార్కులు వచ్చాయి. వైద్య ప్రవేశ పరీక్షలో ఇలా నూటికి నూరు శాతం మార్కులు రావడం అరుదైన విషయం. ఒడిశా విద్యార్థి సోయబ్‌ అఫ్తాబ్‌, దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్‌ ఇలా చరిత్ర సృష్టించారు. జాతీయ స్థాయిలో ఇద్దరికీ వరుసగా ప్రథమ, ద్వితీయ ర్యాంకులు లభించాయి.

జాతీయ స్థాయి నీట్‌ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులూ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థిని తుమ్మల స్నికిత 3వ ర్యాంకు సాధించి, తెలంగాణ ర్యాంకుల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆమె 720 లో 715 మార్కులను సాధించింది. మొత్తం మీద తెలంగాణ విద్యార్థులు 7, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 మంది విద్యార్థలతో కలిపి 15 మంది విద్యార్థులు టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2019 తో పోలిస్తే రెండు రాష్ట్రాల నుండి నలుగురు విద్యార్థులు మాత్రమే గౌరవప్రదమైన జాబితాలో చోటు దక్కించుకున్నారు. తొలి 20 ర్యాంకుల్లో మన విద్యార్థులు మూడు స్థానాల్లో నిలిచారు.

ఇక తెలంగాణకు చెందిన అనంత పరాక్రమ బి నూకల 710 మార్కులు సాధించి అఖిల భారత స్థాయిలో 11 వ ర్యాంకును దక్కించుకున్నారు. బాలుర విభాగంలో తెలంగాణ నుంచి అగ్రస్థానంలో నిలిచాడు. బారెడ్డి సాయి త్రిషారెడ్డి 14వ ర్యాంక్, శ్రీరామ్‌ సాయి శాంతవర్థన్‌ 27వ ర్యాంక్, ఆర్షశ్‌ అగర్వాల్‌ 30వ ర్యాంక్, మల్లేడి రుషిత్‌ 33వ ర్యాంక్, ఆవుల శుభాంగ్‌ 38వ ర్యాంక్ సాధించారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో అఖిల భారత ర్యాంకుల్లో 58వ ర్యాంక్ పొందిన రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్‌ 17వ స్థానాన్ని సాధించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుతి చైతన్య సింధు 715 మార్కులతో అఖిల భారత స్థాయిలో ఆరో ర్యాంక్ సాధించారు. అఖిల భారత 13 వ ర్యాంకు సాధించిన కోట వెంకట్ (710), ఎపికి చెందిన అబ్బాయిలలో టాపర్ గా నిలిచాడు.

తెలంగాణ నుంచి మొత్తం 50,392 మంది హాజరయ్యారు. వారిలో 50% మంది పరీక్షలో అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ లో 57,721 మందిలో 58.63% మంది అభ్యర్థులు నీట్ లో ర్యాంకులు సాధించారు. కొవిడ్‌ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నీట్‌ 2020ను గత నెల 13న నిర్వహించారు. కొవిడ్‌ బాధితుల కోసం ఈనెల 14న మరోసారి నిర్వహించారు. వీరందరి ఫలితాలను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ‘జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టీఏ)’ ఫలితాలను ప్రకటించింది. కాగా, ఈనెల చివరి వారంలో రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి.

ఇక తెలంగాణ నుంచి జాతీయస్థాయి కోటాలో భాగంగా 467 ఎంబీబీఎస్‌ సీట్లను ఇస్తారు. అఖిల భారత కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్‌, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో 4,915 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక జాతీ స్థాయి ర్యాంకుల ఆధారంగా ప్రాథమిక ర్యాంకులను రాష్ట్ర స్థాయిలో విడుదల చేస్తారు.ఈనెల చివరి వారంలో కన్వీనర్‌ కోటాలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటనను విడుదల చేసి, అర్హుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. కొవిడ్‌ దృష్ట్యా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.