Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్‌లో రైతు భరోసా నిధులు..
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వానాకాలం సీజన్ రైతు భరోసా ఆర్థిక సాయం విడుదలకు ముహూర్తం ఖరారైంది. డిప్యూటీ సీఎం భట్టి ఇలాక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్‌కు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ఈ నెల 30న విడుదల చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గాన్ని ఇందుకు వేదికగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా మధిరలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సభా వేదిక నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను నేరుగా జమ చేసే ప్రక్రియను సీఎం ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి విడతల వారీగా నిధుల జమ మొత్తం తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అర్హులైన రైతులందరికీ దశలవారీగా ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మధిరలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించింది. సభా ప్రాంగణం, భద్రత, రవాణా, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
