అరమరికలు లేకుండా రైతులతో చర్చలు, పానెల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు చేస్తున్న నిరసనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఓపెన్ మైండ్ తో (అరమరికలు లేకుండా)  రైతు సంఘాలతో చర్చలు జరపకపోతే అవి మళ్ళీ విఫలమవుతాయని..

అరమరికలు లేకుండా రైతులతో చర్చలు, పానెల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 16, 2020 | 5:28 PM

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు చేస్తున్న నిరసనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఓపెన్ మైండ్ తో (అరమరికలు లేకుండా)  రైతు సంఘాలతో చర్చలు జరపకపోతే అవి మళ్ళీ విఫలమవుతాయని కోర్టు పేర్కొంది. అందువల్ల రైతు సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులతో కూడిన పానెల్ ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు కేంద్రానికి, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు అత్యున్నత  న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వింటర్ వెకేషన్ ప్రారంభానికి ముందే రేపటికల్లా వీటికి స్పందించాలని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే  తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ చట్టాలు తమకు వ్యతిరేకమని అన్నదాతలు భావిస్తున్నారు. ఈ కారణంగా ఎలాంటి భేషజాలకు పోకుండా వారితో సంప్రదింపులు జరపాలి..లేనిపక్షంలో అవి మళ్ళీ విఫలమవుతాయి అని ఆయన అన్నారు.

సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించారు. ఇది త్వరలో జాతీయ సమస్యగా మారవచ్చుఅన్నారు. రైతు నిరసనలపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, న్యాయమూర్తులు ఎ.ఎస్.బోపన్న, వి.రామసుబ్రమణ్యన్ లతో కూడిన బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.పిటిషనర్లు…. నిరసన తెలుపుతున్న అన్నదాతలను తమ పిటిషన్లలో పార్టీగా ఎందుకు చేర్చలేదని కోర్టు ప్రశ్నించింది. గురువారం ఈ పిటిషన్లపై తదుపరి విచారణ జరగాలని కోర్టు నిర్ణయించింది. ఇప్పటివరకు మీరు అన్నదాతలతో  జరిపిన చర్చలు వర్కవుట్ కాలేదని కేంద్రానికి మెత్తమెత్తగా చురకలు వేసింది. రైతుల వాదనలను ఆలకించాల్సిందే అని పేర్కొంది.