ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఆస్తిలో ఆడపిల్లలకు సమాన వాటాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన వేర్వేరు పిటిషన్‌లపై...

Top Court Backs Daughter’s Right To Property : ఆస్తిలో ఆడపిల్లలకు సమాన వాటాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన వేర్వేరు పిటిషన్‌లపై విచారణ అనంతరం శ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అమల్లోకి వచ్చిన నాటికి తల్లిదండ్రి జీవించి ఉన్నా, లేకున్నా ఆడపిల్లలకు వారి ఆస్తులపై కొడుకులతో సమానంగా హక్కు ఉంటుందని నేటి తీర్పులో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పులో వెల్లడించింది.
ధర్మాసనంలో జస్టిస్ అరుణ్ మిశ్రాతోపాటు జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షా సభ్యులుగా ఉన్నారు. కుమార్తె జీవితాంతం తండ్రిని ప్రేమిస్తూనే ఉంటుందని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో తుది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో బాధితురాలి తండ్రి 1999 డిసెంబర్ 11న మరణించారు. ఆస్తిలో ఆడపిల్లకు సమానహక్కు కల్పించే హిందూ వారసత్వ సవరణ చట్టం 2005లో అమల్లోకి వచ్చినందున ఆ సవరణ జరిగిన తేదీని ప్రాతిపదికగా తీసుకుంటే ఫులావతికి ఆస్తిలో సమానహక్కు దక్కదనేది ప్రతివాదుల వాదన. దీనిపై భిన్న వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరికి వివాదాన్ని ముగించారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు ఆస్తిలో సమానహక్కు ఉంటుందని స్పష్టంచేసింది.
1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9న ఆ చట్టానికి భారత పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే… తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఉంటుందని ఆ చట్టంలో పేర్కొన్నారు. హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికే కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు కూడా కొత్త చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.