సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న కేసుల వివరాలెందుకు సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది.

  • Rajesh Sharma
  • Publish Date - 2:28 pm, Wed, 4 November 20
సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

Sitting leaders cases on priority:  ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరంగా విచారించాలన్న సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ ఇచ్చిన నివేదికపై కీలక చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసుల్లో ప్రస్తుతం సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై వున్న కేసులను మొదటి ప్రాధాన్యతగా విచారించాలని సుప్రీంకోర్టును అమికస్ క్యూరీ కోరింది. దానికి సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే.. అమికస్ క్యూరీ సమర్పించిన నివేదకను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించింది. అమికస్ క్యూరీ నివేదిక బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు చేరింది.

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు సత్వర విచారణ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. నేటి విచారణలో భాగంగా అమికస్ క్యూరీ రిపోర్టును ధర్మాసనానికి అందజేసింది. ఈ రిపోర్టుపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ అనిరుద్దా బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్రాల హైకోర్టుల అంశాలతో నివేదికను కోర్టుకు సమర్పించారు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా. నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించేలా రాష్ట్రాలను ఆదేశించాలని విజయ్ హన్సారియా తన నివేదికలో సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను కనీసం రెండు ఏళ్లకు నియమించాలని ఆయన సూచించారు.

కాగా.. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో పెండింగులో ఉన్న కేసుల వివరాలు ఎందుకు సమర్పించలేదని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక శిక్ష పడే కేసులను తొలుత విచారించాలని, సిట్టింగ్ ప్రజాప్రతినిధుల కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని అమికస్ క్యూరి ధర్మాసనానికి సమర్పించిన నివేదికలో సిఫారసు చేశారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల హైకోర్టులను ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై తక్షణం నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని అమికస్ క్యూరీ కోరగా.. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సమగ్ర నివేదిక సమర్పించాలని కర్నాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు హైకోర్టులను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

కోర్టులు జారీ చేసిన వారెంట్లను అమలు చేయడంపై నివేదిక సమర్పించాలని కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం నిర్దేశించింది. వీడియో కాన్ఫరెన్స్ రూంల ఏర్పాటు కోసం హైకోర్టులకు నిధులు సమకూర్చలని జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అమికస్ క్యూరీ, హైకోర్టుల నివేదికలను పరిశీలించి ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

ALSO READ: ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

ALSO READ: హరీశ్ చొరవతో రైతుల సమస్య పరిష్కారం

ALSO READ: వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం