TDP leader silence: రాజు గారి మౌనం వెనుక మర్మం ఏంటో?
మాజీ మంత్రి సుజయరంగారావు కొంత కాలంగా మౌనం పాటిస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా? లేక పార్టీ మారతారా అన్న విషయంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
TDP leader Sujaya Rangarao silence since many days: రాజుగారి మౌనానికి అర్ధమేంటి? ఉంటారా? పార్టీ మారతారా? అని ఉత్కంఠతో చూస్తోంది టీడీపీ కేడర్. ఎన్నికల తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు. దీంతో తమ నేత స్టాండ్ తెలియక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. దీంతో ఆ బొబ్బిలి రాజు ప్రస్థానం ఎటు అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సుజయకృష్ట రంగారావు… విజయనగరం జిల్లా బొబ్బిలి రాజవంశీయులు… రాచరికం అంతరించిన తర్వాత కూడా ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ తన నియోజకవర్గపు కోటను పాలించారు. అయితే, ఇప్పుడు, యుద్ధంలో ఓడిన రాజులా డీలాపడిపోయారు. దీంతో ఆయన రాజ్యంలో కార్యకర్తలు విలవిల్లాడిపోతున్నారు. రాజుగారి మౌనాన్ని తలచుకుని కుంగిపోతున్నారు.
రాజరికపు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన సుజయకృష్ట రంగారావు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందాక, టీడీపీలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. అయితే, మంత్రి అయిన తర్వాత, సుజయకృష్ట రంగారావు నియోజకవర్గ అభివృద్దిని పట్టించుకోలేదని…… అందుకే 2019 ఎన్నికల్లో ఓడిపోయారని అంటారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు సుజయకృష్ట రంగారావు దూరంగా ఉంటున్నారు. అయితే, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ, నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉండటంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
Also read: Internal war between TRS MLAs over Cooperative posts
నియోజకవర్గ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసి, పార్టీని బలోపేతం చేయాల్సిన రాజుగారు ఇలా, మౌనం దాల్చడమేంటని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. సుజయకృష్ట రంగారావుతోపాటు ఆయన సోదరుడు శ్వేతా చలపతి రంగారావుకు నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. వాళ్లిద్దరూ ప్రజల్లోకి వెళ్తే మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. సుజయకృష్ట రంగారావు సోదరుడు శ్వేతా చలపతి రంగారావు టీడీపీని వీడి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయనగరం టీడీపీలో స్తబ్దత నెలకొనడంతో ఇప్పటికే పలువురు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని అంటున్నారు.
మొత్తానికి, విజయనగరంలో తెలుగుదేశాన్ని ముందుకు నడిపించే నాయకుడు లేడంటూ కొట్టుమిట్టాడుతున్న టీడీపీ శ్రేణులను, బొబ్బిలి రాజుగారి మౌనం, మరింత కుంగదీసేలా ఉందని అంటున్నారు. మరి, రాజుగారి మనసులో ఏముందో… పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండటానికి కారణాలేంటో తెలియాలంటే ఆయన మౌనం వీడాల్సిందే.