Sabairmala Temple: రేపటి నుంచి మండల పూజకు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. వర్షాల దృష్ట్యా భక్తులకు స్పాట్ బుకింగ్ నిలిపివేత…
Sabairmala Temple: మండల-మకరువిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సోమవారం ( నవంబరు 15) తెరుచుకోనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు..
Sabairmala Temple: మండల-మకరువిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సోమవారం ( నవంబరు 15) తెరుచుకోనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు సన్నిధానం తెరిచి..16 ఉదయం నుంచి భక్తులను దర్శనానికి అనుమతినిస్తారు. రేపు సాయంత్రం ప్రధానార్చకుడు వీకే జయరాజ్ ఆలయ గర్భగుడిని తెరిచి జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. అయితే కేరళలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా భక్తుల కోసం స్పాట్ బుకింగ్ నిలిపివేశారు. ఆదివారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మరో నాలుగు రోజుల పాటు భక్తులపై ఆంక్షలు విధించనున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా తమ స్లాట్‌లను బుక్ చేసుకున్న వారు తర్వాత తేదీల్లో దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. మలయాళ మాసం వృశ్చికం మొదటి రోజు నవంబర్ 16 నుండి స్వామివారిని భక్తుల దర్శించుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు, స్పాట్ బుకింగ్ కోసం నిలక్కల్‌లో ఐదు ప్రత్యేక కౌంటర్లను తెరిచారు. భక్తులు పుణ్యక్షేత్రాన్ని దర్శించే ముందు పంపా నదిలో స్నానాలు చేయడాన్ని కూడా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని రెండు నెలల పాటు ఆలయాన్ని భక్తులు సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు సీజన్ సందర్భంగా రోజుకు 30వేల మందిని అనుమతించనున్నామని అధికారులు వెల్లడించారు. డిసెంబరు 26న మండలపూజ ముగుస్తుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. మూడు రోజుల అనంతరం తిరిగి డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు కోసం ఆలయాన్ని తెరవనున్నారు. 2022 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న పడిపూజ అనంతరం ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోస్‌లు వ్యాక్సిన్ వేసుకున్నట్టు సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ పరీక్ష రిపోర్ట్ తీసుకుని రావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు.