AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు.. ఈ బ్యాడ్‌లక్కోడి లక్ ఎప్పుడు మారేనో?

India vs Afghanistan ODI 2026: వన్డే క్రికెట్‌లో తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నా ఈ ప్లేయర్‌ను, దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీ బాదిన తర్వాత కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ పెద్దగా పట్టించుకోలేదు. కోహ్లీ స్థానంలోనైనా అవకాశం వస్తుందని ఆశించినా మరోసారి నిరాశే మిగిలింది.

ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు.. ఈ బ్యాడ్‌లక్కోడి లక్ ఎప్పుడు మారేనో?
Ruturaj Gaikwad, Virat Kohli
Venkata Chari
|

Updated on: Jun 11, 2026 | 1:35 PM

Share

India vs Afghanistan ODI 2026: 50 ఓవర్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డులు, చూపించిన స్థిరత్వం అసాధారణం. అలాంటి రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డునే ఒక భారత యువ ఆటగాడు అధిగమించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో కోహ్లీ కంటే మెరుగైన సగటు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌లో అతనికి మొండిచేయే ఎదురైంది. ఆ దురదృష్టకర స్టార్ ఆటగాడి కథేంటో ఓసారి చూద్దాం.

కోహ్లీ గాయం.. ప్రత్యామ్నాయంగా దక్కని అవకాశం..

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రమైన హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీనివల్ల ఆయన ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కోహ్లీ స్థానంలో గతంలో దక్షిణాఫ్రికాపై అద్భుత శతకంతో మెరిసిన యువ సంచలనం జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ, సెలెక్టర్లు ఊహించని విధంగా యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసి, ఆ నిలకడైన ఆటగాడిని మరోసారి పక్కనబెట్టారు. జైస్వాల్ ప్రతిభావంతుడే అయినప్పటికీ, జట్టు అవసరాల రీత్యా ఆ స్టార్ ప్లేయర్‌కు అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎవరా ఆటగాడు? ఎందుకీ నిర్లక్ష్యం?

సెలెక్టర్ల నిర్లక్ష్యానికి గురవుతున్న ఆ అద్భుతమైన ఆటగాడు మరెవరో కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. వన్డే క్రికెట్‌లో తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్న గైక్వాడ్‌ను, దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీ బాదిన తర్వాత కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ పెద్దగా పట్టించుకోలేదు. కోహ్లీ స్థానంలోనైనా అవకాశం వస్తుందని ఆశించిన రుతురాజ్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఆయన లంక పర్యటనలో ఇండియా-ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. జూన్ 9న శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన శతకంతో సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టేలా సమాధానమిచ్చాడు.

సంక్షోభంలో సెంచరీతో మెరిసిన గైక్వాడ్..

శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు ఒకానొక దశలో కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టును ఆదుకునే బాధ్యతను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన భుజాలపై వేసుకున్నాడు. కేవలం 114 బంతుల్లో 101 పరుగులు చేసి, తన లిస్ట్-ఏ కెరీర్‌లో 21వ శతకాన్ని నమోదు చేశాడు. ఆయన అద్భుత ఇన్నింగ్స్ వల్లే భారత్ నిర్ణీత ఓవర్లలో 277 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అనంతరం లంక జట్టును 269 పరుగులకే కట్టడి చేసి, ఇండియా-ఏ జట్టు 8 పరుగుల ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.

విరాట్ కోహ్లీ, మైఖేల్ బెవన్ కంటే పైనే!

లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు ఉన్న ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్ అందరికంటే అగ్రస్థానంలో నిలుస్తాడు. ఆయన రికార్డులు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవన్, భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా ఉన్నాయి.

రుతురాజ్ గైక్వాడ్: ఇప్పటివరకు 100 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 96 ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్, ఏకంగా 59.32 అద్భుతమైన సగటుతో 5,161 పరుగులు చేశాడు. ఇందులో 21 శతకాలు, 19 అర్ధశతకాలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఆయన 347 మ్యాచ్‌లలో 57.91 సగటుతో 16,447 పరుగులు సాధించాడు.

మైఖేల్ బెవన్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన బెవన్ 427 మ్యాచ్‌లలో 57.86 సగటుతో 15,103 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

టి20, టెస్టుల్లో రుతురాజ్ గైక్వాడ్ స్థానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, యాభై ఓవర్ల ఫార్మాట్‌లో ఆయన గణాంకాలు నూటికి నూరు శాతం తిరుగులేనివి. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజం కంటే ఎక్కువ సగటు కలిగి ఉండి, దేశవాళీ టోర్నీలలో శతకాలతో చెలరేగుతున్నా రుతురాజ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రతిభకు పెద్దపీట వేయాల్సిన సెలెక్టర్లు, ఇప్పటికైనా ఈ క్లాస్ ప్లేయర్ వైపు చూస్తారో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us