టీఆర్ఎస్-మజ్లిస్ మధ్య డైలాగ్ వార్.. మజ్లిస్‌ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు

టీఆర్‌ఎస్‌.. మజ్లిస్‌ మిత్రపక్షాలని బీజేపీ ఆరోపిస్తోంది. కాని అనూహ్యంగా బల్దియా ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటోంది మజ్లిస్‌ . తమకు గద్దెను ఎక్కించడం తెలుసని , దింపడమూ కూడా తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌. ఈ మధ్యే కళ్లు తెరిచిన చిలుకంటూ కేటీఆర్‌ను విమర్శించారు. బీజేపీకి బీటీమ్‌గా మజ్లిస్‌ పనిచేస్తోందని టీఆర్‌ఎస్‌ కౌంటరిచ్చింది.

టీఆర్ఎస్-మజ్లిస్ మధ్య డైలాగ్ వార్.. మజ్లిస్‌ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 22, 2020 | 9:55 PM

Dialogue War Between TRS – Majlis : గ్రేటర్‌ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాతబస్తీలో పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంఐఎం.. ఓట్ల కోసం అధికార పార్టీనే టార్గెట్ చేసింది. ఇంతకాలం మిత్రపక్షం అంటూ వ్వవహరించిన మజ్లిస్ నేతలు.. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ హెచ్చరికలకు దిగుతున్నారు.

పాతబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌.. తమకు గద్దెనెక్కించడమూ తెలుసని.. దింపడమూ తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం ఎంఐఎం పార్టీ ఇంటి గుమస్తా లాంటిదన్నారు. ఈ మధ్యే కళ్లు తెరిచిన చిలకంటూ మంత్రి కేటీఆర్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

పాతబస్తీతో పాటు నగరం లోని అన్ని డివిజన్లటో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కొన్ని స్థానాల్ల్లో టీఆర్‌ఎస్‌,మజ్లిస్‌ మధ్య ఫ్రెండ్లీ ఫైట్‌ ఉంది. మంత్రి కేటీఆర్‌పై మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీఆర్‌ఎస్‌ నేతలు. మంత్రి కేటీఆర్‌ బచ్చానో.. బడానో ఎన్నికల తరువాత తెలుస్తుందని అన్నారు మంత్రి తలసారి శ్రీనివాస్‌యాదవ్‌.

పాతబస్తీలో అభివృద్ది పనుల కోసం కేటీఆర్‌ దగ్గరకు వచ్చే మజ్లిస్‌ నేతలు ఇప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి బీటీమ్‌గా మజ్లిస్‌ పనిచేస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా మజ్లిస్‌ పనిచేస్తోందని అన్నారు.

మజ్లిస్‌ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. మైనారిటీ వర్గాల్లో టీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణ చూసి భయపడుతున్నారని విమర్శించారు. అయితే టీఆర్‌ఎస్‌ నేతలే తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మజ్లిస్‌ నేతలు. బల్దియా ఎన్నికల్లో తాము 53 సీట్లు గెలుస్తామని , హాఫ్‌ సెంచరీ తప్పకుండా సాధిస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ , మజ్లిస్‌ నేతల మాటలయుద్దం త్వరలో తారాస్థాయికి చేరే అవకాశం ఉంది.