అధికారి సస్పెన్షన్‌పై ఏపీలో రచ్చ రచ్చ
పలు అవినీతి ఆరోపణలతో సస్పెండయిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు దారితీస్తోంది. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి తెరలేచింది. అదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి పలు అంశాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. తన కుమారుడి కంపెనీ కోసమే ఇజ్రాయిల్ పరికరాల కొనుగోలుకు ఒప్పందాలు కుదిర్చినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ పరికరాల కొనుగోలును సీనియర్ ఐపీఎస్ అధికారులు సురేంద్రబాబు, నళినీ ప్రభాత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. వెంకటేశ్వర రావు […]
పలు అవినీతి ఆరోపణలతో సస్పెండయిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు దారితీస్తోంది. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి తెరలేచింది. అదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి పలు అంశాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి.
తన కుమారుడి కంపెనీ కోసమే ఇజ్రాయిల్ పరికరాల కొనుగోలుకు ఒప్పందాలు కుదిర్చినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ పరికరాల కొనుగోలును సీనియర్ ఐపీఎస్ అధికారులు సురేంద్రబాబు, నళినీ ప్రభాత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. వెంకటేశ్వర రావు వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. గ్లోబల్ టెండర్లు స్కై స్టార్ అనే కంపెనీకి దక్కేలా ఆయనే చక్రం తిప్పినట్లు సమాచారం. ఆ తర్వాత మధ్యలో వచ్చిన ఆకాశం అడ్వాన్స్ కంపెనీకి ప్రాజెక్ట్ అప్పగించేందుకు ఏబీ వెంకటేశ్వరరావు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
తన కుమారుడికి చెందిన ఆకాశం కంపెనీకి ప్రాజెక్టు డెమో చూడకుండానే టెండర్ ఇచ్చేందుకు ఏబీ ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ఐపీఎస్ అధికారులు అభ్యంతరం తెలపడంతో అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ టెండర్లను రద్దు చేసినట్లు చెబుతున్నారు. మావోయిస్టుల ఏరివేతకు పెద్ద ఎత్తున మానవ రహిత ఏరియల్ పరికరాల కొనుగోలుకు ఇజ్రాయెల్ దేశంతో జరిగిన ఒప్పందంలో సుమారు 40 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు చెప్పుకుంటున్నారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఏబీపై ప్రస్తుతం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.
అయితే ఏబీపై వేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం అధికారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో పనిచేసిన కొందరు అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నది అచ్చెన్నాయుడు వాదన. పెద్ద స్థాయి అధికారులను బలిచేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయనంటున్నారు. అదే సమయంలో ఏబీకి వ్యతిరేకంగా పని చేస్తున్న అధికారులను తెలుగుదేశం నేతలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే ఇంకో ప్రభుత్వంలోను పని చేయాల్సి వుంటుందన్న అంశాన్ని అధికారులు విస్మరించవద్దని అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఏబీపై తక్షణం సస్పన్షన్ ఎత్తివేయాలని చంద్రబాబు కూడా డిమాండ్ చేశారు.
మరోవైపు టీడీపీ నేతలకు ధీటుగా బదులిస్తున్నారు వైసీపీ నేతలు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దేశ భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాదిస్తున్నారు. తన అక్రమ సంపద కోసం, దేశ భద్రతను ఫణంగా పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. ఐపీఎస్ అదే పదాన్ని ‘‘ఇండివిడువల్ పొలిటికల్ సర్వీస్’’గా మార్చారని చెవిరెడ్డి అంటున్నారు. ఏబీవీ అంటే అవినీతికి బాస్ అని తన పేరును సార్ధకం చేసుకున్నారని, ఏబీవీపై కేంద్రం చర్యలు తీసుకోవాలని చెవిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని అందుకే ఆయన్ని తక్షణం అరెస్టు చేయాలని అంటున్నారు. ఏబీవీతోపాటు ఆయన శిష్యులు శ్రీనివాస్, రామ్ కుమార్‌పైనా విచారణ జరగాల్సి వుందంటున్నారు చెవిరెడ్డి.