Budaun Gang rape case: యూపీ బుదౌన్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్ట్.. పూజారి సత్య నారాయణ్‌ అదుపులో తీసుకున్న పోలీసులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు పాల్పడ్డ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 3:50 pm, Fri, 8 January 21
Budaun Gang rape case: యూపీ బుదౌన్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్ట్.. పూజారి సత్య నారాయణ్‌ అదుపులో తీసుకున్న పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన బుదౌన్ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు పాల్పడ్డ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. గురువారం రాత్రి సత్యనారాయణ్‌ (50) అనే ఆలయ పూజారిని అరెస్టు చేశారు. నిందితుడు ఉఘైతీ గ్రామ సమీపంలోని ఆడవిలో.. తన అనుచరుడి ఇంట్లో నుంచి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

బుదౌన్‌ జిల్లా ఉఘైతీ గ్రామానికి చెందిన 50 ఏళ్ల బాధితురాలు.. ఈ నెల 3వ తేదీ ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయానికి వెళ్లారు. మహిళ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం ఊరంతా గాలించారు. చివరికి అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. అనంతరం జరిగిన శవపరీక్షలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వెల్లడైంది. అంతేకాకుండా బాధితురాలి పక్కటెముకలు, కాలు విరిగినట్టు.. రహస్యావయవాలను తీవ్రంగా గాయపర్చినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూపీ సర్కార్ ప్రత్యేక బ‌ృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ కేసుకు సంబంధించి నిందితుల్లో ఇద్దరు నిందితులను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టించిన వారికి రూ. 50 వేల రివార్డు కూడా ప్రకటించారు. నిందితుడు సత్య నారాయణ్‌ను ప్రశ్నిస్తున్నామని.. వైద్య పరీక్షల అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుస్తామని సీనియర్‌ ఎస్పీ సంకల్ప్‌ శర్మ తెలిపారు.