మరో అద్భుతానికి నాంది పడబోతోంది… నూతన పార్లమెంట్ భవనానికి ఈరోజు ప్రధాని మోదీ భూమి పూజ

ప్రధాని మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం కొత్త భవనానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

మరో అద్భుతానికి నాంది పడబోతోంది... నూతన పార్లమెంట్ భవనానికి ఈరోజు ప్రధాని మోదీ భూమి పూజ
Follow us

|

Updated on: Dec 10, 2020 | 5:54 AM

New Parliament Building : ఢిల్లీ నడిబొడ్డున కొలువుదీరిన పార్లమెంట్‌ భవనం… ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న ప్రస్తుత భవనం స్థానంలో కేంద్రం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌.. సరికొత్త హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకోనుంది.

భారతీయుల కలల సాకారానికి గుర్తుగా నిలిచే నూతన పార్లమెంటు భవనానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోకసభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, పలు దేశాల రాయబారులు సహా సుమారు 200 మంది స్పెషల్ గెస్టులుగా హాజరు కాబోతున్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. త్రిభుజాకారంలో.. అత్యాధునిక ఇంధన సామర్ధ్యంతో.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా సౌకర్యాలు నూతన పార్లమెంటులో ఉంటాయి. లోక్‌సభ ప్రస్తుత పరిమాణానికి 3 రెట్లు, రాజ్యసభ గణనీయమైన స్థాయిలో విశాలంగా నిర్మాణం జరగబోతోంది.

ఢిల్లీలో ప్రస్తుత పార్లమెంట్‌ భవనానికి సమీపంలోనే ఈ నిర్మాణాలను చేస్తున్నారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా నూతన భవనాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింంది. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

ఆధునిక హంగులు..

ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ భవనంలో ఎన్నో ప్రత్యేక సౌకర్యాలను కల్పించనున్నారు. మరో రెండేళ్లలో స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నూతన భవనంలోనే ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని లక్ష్యంగా పనుల్లో వేగం పెంచింది. ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ భవనంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ భారీ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేస్తుండగా.. వాటిలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి ప్రత్యేక మార్గాన్ని కేటాయించారు. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్‌పర్సన్, ఎంపీలలకు ఓ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇవే ప్రత్యేకతలు…

అంతే కాదు వీటిలో చాలా ప్రత్యేకతలున్నాయి. మొత్తంగా 64 వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం జరుగనుంది. అధిక తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం ఈ నూతన కట్టడం తట్టుకునే సామర్థ్యం ఉండేలా నిర్మాణం చేయనున్నారు. నాలుగు అంతస్తుల్లో నూతన పార్లమెంట్ భవనం ఉండగనుంది. భూగర్భంలోని లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 20 మంత్రుల కార్యాలయాలు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 18 కార్యాలయాలుమొదటి అంతస్థులో 26, రెండో అంతస్థులో 28 కార్యాలయాల నిర్మాణంలోక్‌సభకు ఆనుకొనే ఉండే విధంగా ప్రధాన మంత్రి కార్యాయంను ప్లాన్ చేశారు.

దేశీయ వాస్తు రీతిలో నిర్మాణం…

ఈ నూతన భవనంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ భవన నిర్మాణాన్ని దేశీయ వాస్తు రీతుల్లో నిర్మించడం మరో ముఖ్యమైన విశేషం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులను ఈ నిర్మాణాల్లో చూడవచ్చని అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులను నిర్మాణంలో భాగస్వాములను కేంద్రం చేసింది.

ప్రాజెక్టును దక్కించుకున్న టాటా సంస్థ..

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనానికి సమీపంలోనే నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. రూ. 971 కోట్లతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టును టాటా సంస్థ దక్కించుకుంది. దీనికి హెచ్​సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేస్తోంది. దాదాపు రూ. 861 కోట్లతో సెంట్రల్‌ విస్తా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 22 నెలల వ్యవధిలో పార్లమెంట్ భవనం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. 2022 అక్టోబర్‌ నాటికి కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం పూర్తవనుండగా… అప్పటివరకు ఇప్పుడున్న పార్లమెంట్‌ భవనంలోనే సమావేశాలు నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వెల్లడించింది.