సిద్దిపేటలో నెరవేరుతున్న సొంతింటి కల..ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం..కాసేపట్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శ్రీకారం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తారు. ముందుగా నర్సాపూర్‌లో 163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభిస్తారు. దీంతో పాటు జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన..
Bedroom Houses in Narsapur : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తారు. ముందుగా నర్సాపూర్‌లో 163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభిస్తారు. దీంతో పాటు జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. సిద్దిపేట డీగ్రీ కాలేజీలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు పర్యవేక్షిస్తున్నారు.
నగరాల్లో ఉండే గేటెడ్ కమ్యూనిటీ తరహాలోనే ఈ ఇళ్లను కట్టించారు. ఇప్పుడిక్కడ పేదలు గృహప్రవేశాలు చేయబోతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సపురం వద్ద గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా అత్యున్నత ప్రమాణాలతో గృహసముదాయాన్ని నిర్మించింది. మొత్తం 45 ఎకరాల్లో G+2 విధానంలో 205 బ్లాక్‌లు కట్టారు. మొత్తం 2,460 ఇళ్లు పూర్తయ్యాయి.
ఇప్పటికే 1,341 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. పిల్లల ఆటస్థలం, పార్కు, ఇలా ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పించారు. పచ్చదనం పరుచుకునేలా గ్రీనరీ, అంతర్గత సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. పేదల కోసమే కట్టినా… ఏ చిన్న అసౌకర్యం లేకుండా ఇళ్లను పూర్తి చేశారు. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందిస్తున్నారు.
ఇవాళ ఈ ఇళ్లల్లోకి గృహప్రవేశం చేయబోతున్నారు లబ్దిదారులు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 144 మందితో గృహప్రవేశాలు చేయిస్తారు. మిగిలిన అర్హులకు రెండో విడుతలో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్న ఇళ్లు తమ సొంతం కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఇంటి కోసం పడిన కష్టాలు ఇప్పటితో తీరాయని సంబరపడుతున్నారు.
మరోవైపు సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు. నర్సాపూర్‌లో కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయానికి ‘కేసీఆర్ నగర్’గా నామకరణం చేసినట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.