స్నేహితులతో కలిసి కన్నతల్లి నగలే కాజేశాడు.. తెలిశాక ఆ అమ్మ ఏమన్నదో తెలుసా..?
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవలో కన్నతల్లి నాగమణి బంగారు ఆభరణాలను కుమారుడు తోట రాంబాబు తన స్నేహితులతో కలిసి దొంగిలించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు మూడు రోజుల్లోనే కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తన కుమారుడు చెడు స్నేహాల కారణంగానే ఈ పరిస్థితికి వచ్చాడంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

సృష్టిలో అమ్మ ప్రేమకు అవధులు ఉండవు. బిడ్డలు మంచి వారైనా.. చెడు దారిలో వెళ్లినా.. వారిని వెనకేసుకొచ్చే బంధం తల్లి ప్రేమే. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామంలో జరిగిన ఓ చోరీ ఘటనలోనూ ఇదే భావన కనిపించింది. కన్నతల్లి మెడలోని బంగారు గొలుసును కుమారుడే తన స్నేహితులతో కలిసి దొంగిలించాడని పోలీసులు చెబుతుండగా.. తన కుమారుడు చెడు స్నేహాల కారణంగానే ఇలా మారిపోయాడంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. విరవ గ్రామానికి చెందిన తోట నాగమణి ఇంట్లో గత ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నాగమణి నిద్రిస్తున్న సమయంలో ఆమె కుమారుడు తోట రాంబాబు తన స్నేహితులైన దాసరి ప్రసాద్, రంపం విజయ్ కుమార్‌లతో కలిసి చోరీకి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ బంగారు గొలుసు ఇవ్వాలని రాంబాబు తల్లిని పలుమార్లు వేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. చోరీలో భాగంగా రాంబాబు ఇంటి బయట కాపలాగా ఉండగా.. అతని స్నేహితులు ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. నిద్రిస్తున్న నాగమణి ముఖంపై టవల్ వేసి, ఊపిరాడకుండా చేసి ఆమె మెడలోని బంగారు గొలుసుతో పాటు చేతికున్న రెండు గాజులను అపహరించినట్లు వెల్లడించారు.
మూడు రోజుల్లోనే కేసు ఛేదింపు
కేసును సవాల్‌గా తీసుకున్న పిఠాపురం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, సుమారు రెండున్నర కాసుల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు వివరాలను పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గాజులు వీర వెంకట సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. కుమారుడు రాంబాబు పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి తల్లి ఇంట్లో చోరీ చేయించిన విధానాన్ని ఆయన వివరించారు.
‘నా కొడుకు చెడ్డవాడు కాదు.. స్నేహితుల వల్లే ఇలా’
మరోవైపు నాగమణి మాత్రం తన కుమారుడిపై ప్రేమను, ఆవేదనను వ్యక్తం చేసింది. తన కుమారుడికి గతంలో ఎప్పుడూ దొంగతనం చేసే అలవాటు లేదని చెప్పింది. గతంలో ఇంట్లో బంగారు గొలుసు బయట కనిపించినప్పుడు కూడా దానిని తీసి తనకు ఇచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. “నా కొడుకుకు దొంగతనం చేసే అలవాటు లేదు. చెడు స్నేహాల వల్లే ఇలా తయారయ్యాడు. దొంగతనం చేయడానికి కూడా తన స్నేహితులను తీసుకొచ్చాడు” అంటూ నాగమణి కన్నీటి పర్యంతమైంది. కన్నతల్లి ఆభరణాలపైనే కన్నేసి.. స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడన్న పోలీసుల ఆరోపణలు ఒకవైపు.. తన కుమారుడు చెడు స్నేహాల వల్లే ఈ పరిస్థితికి వచ్చాడంటూ తల్లి ఆవేదన మరోవైపు.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
