Petrol, diesel prices today: దేశంలో గత కొంతకాలంగా నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. వరుసగా మూడో రోజూ కూడా పెట్రో ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. తాజాగా లీటర్‌కు 25 నుంచి 30 పైసల వరకు పెంచుతూ గురువారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.85కి చేరగా.. డీజిల్ ధర రూ.78.03కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.94.36కు పెరగగా.. డీజిల్ రూ.84.94 కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.89.16 ఉండగా.. డీజిల్ రూ.81.61కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ రూ.90.19గా.. డీజిల్ ధర రూ.83.16 గా ఉంది. తాజా పెంపుతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్‌పై సుమారు రూ.4 వరకు పెరిగింది. అంతేకాకుండా గతేడాది నుంచి పెట్రో, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో గురువారం లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.91.35కి చేరింది. డీజిల్ ధర రూ.85.11కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లాలో పెట్రోల్ ధర రూ.93.86 కి చేరగా.. రూ.87.13 కి పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌పైనే ఆధారం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కాగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన లేదని కేంద్ర పెట్రోలియంశాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ.. దేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయని తెలిపారు. దేశ అవసరాలను తీర్చేందుకు భారత్ దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని.. కావున మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగితే మనం కూడా ధరలు పెంచాల్సి వస్తుందని ఆయన బదులిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాలకు అనుగుణంగా పన్నులను విధించడంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
Also Read: