GHMC Mayor Election : గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మీ… డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత
టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నియ్యారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు.
GHMC mayor election : ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీ విధేయులకే వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది. అది నుంచి టెన్షన్‌కు గురిచేసిన మేజిక్ ఫిగర్ లెక్క తేలడంతో.. చివరికి టీఆర్ఎస్ పార్టీనే పైచేయి సాధించింది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది.
టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నియ్యారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు. విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది. ఆమె మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్ చివరి నిమిషంలో కేకే కుమార్తెను ఖరారు చేశారు. కాగా గ్రేటర్ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతో టీఆర్‌ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేజిక్కించుకుంది.
ఈ ఎన్నిక ప్రక్రియకు కలెక్టర్ శ్వేతామహంతి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకునిగా ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియాను ఎన్నికల సంఘం నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే అందులో ఒక కార్పొరేటర్ చనిపోవడంతో.. కౌన్సిల్‌లో 149 మంది కార్పొరేటర్లు, అలాగే 44 మంది ఎక్స్‌అఫీషియోలతో కలిపి మొత్తం సభ్యులు 193 మిగిలారు. వీరిలో 97 మంది హాజరైతే కోరం ఉన్నట్టుగా పరిగణిస్తూ మేయర్ ఎన్నిక జరగనుంది. వీరిలో ఎక్కువ మంది సభ్యుల మద్దతున్న కార్పోరేటర్.. మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
LIVE NEWS & UPDATES
-
“విజయం”లక్ష్మీ దక్కిన పీఠం
మేయర్ పీఠం కోసం మొదటి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. భారతీనగర్ కార్పొరేటర్‌గా గెలుపొందిన సింధు ఆదర్శ్‌రెడ్డి తోపాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి, పీజేఆర్కుమార్తె విజయారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ అధిష్టానం.. చివరి నిమిషంలో పార్టీ సెక్రటరీ జనరల్ కేకే కుమార్తె విజయలక్ష్మీ పేరును ఖరారు చేశారు. అయితే విజయారెడ్డి సైతం మేయర్ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా విజయలక్ష్మికి మేయర్ పీఠం కట్టబెట్టారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడంతో విజయలక్ష్మీ విజయం నల్లేరు మీద నావలా సాగింది.
-
నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు కృషీః మేయర్ విజయలక్ష్మీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి.. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తానని అన్నారు. నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు కృషీ చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతిపై పోరాటం కోసం ఎంత దూరమైన వెళ్తాను అని తేల్చిచెప్పారు. మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి మరోసారి దన్యవాదాలు తెలిపిన విజయలక్ష్మి.
-
-
డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత
టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నియ్యారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు.
-
హైదరాబాద్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మొదట మేయర్‌గా విజయలక్ష్మి పేరును బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ప్రతిపాదించారు. గాజులరామారం కార్పొరేటర్ ఈ ప్రతిపాదనను సమర్ధించారు. దీంతో హైదరాబాద్ నూతన మేయర్‌గా విజయలక్ష్మీ పేరును ప్రకటిస్తున్నట్లు ప్రిసెడింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.
-
మొదలైన మేయర్ ఎన్నిక
బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మీ పేరును ప్రతిపాదించిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థికి ఎంఐఎం కార్పొరేట్లు మద్దతు.
-
-
కార్పొరేటర్లలో జోష్ నింపిన గోరేటి వెంకన్న పాట
అందుకు ముందు తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం ముగిసిన అనంతరం నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు.. ప్రత్యేక బస్సుల్లో జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయల్దేరారు. ఈ సందర్భంగా గోరేటి వెంకన్న తన పాటతో కార్పొరేటర్లను ఉత్తేజపరిచారు. రాములోరి సీతమ్మ అనే పాట పాడి అందరిలో జోష్ నింపారు. ఇందుక సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ పాటకు ఎమ్మల్సీ లక్ష్మణ్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కోరస్ అందించారు.
-
మారిన మేజిక్ ఫిగర్.. 96 మంది ఉంటే చాలు
ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులు రాకపోవడంతో… నెంబర్ గేమ్ మారిపోయింది. మొత్తం సభ్యుల సంఖ్య 190కి చేరింది. 96 మంది మద్దతు ఉంటే… మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకున్నట్లే. టీఆర్ఎస్‌కు 56 కార్పొరేటర్లు, 31 ఎక్స్‌అఫిషియోలతో కలుపుకుని బలం 87 మందికి చేరింది. మేయర్ బరిలో టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఎంఐఎంపై వైపు నుంచి ఇంకా స్పష్టత రావల్సి ఉంది. అయితే, మూడు పార్టీలు పోటీలో ఉంటే… టీఆర్ఎస్ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీ ఓట్లు ఆ పార్టీకే ఉన్నాయి.
-
టీఆర్ఎస్‌ను వరించనున్న మేయర్ పీఠం..!
మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు క్రియాశీలకంగా మారింది. టీఆర్‌ఎస్ పార్టీ తరుపున 32మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. దీంతో మొత్తంగా చూస్తూ టీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్న సంఖ్యాబలం 87. ఇక, బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ అఫీషియోలతో కలిసి 49గా ఉంది. అటు ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో 10 మందితో కలిపి 54 మంది బలం ఉంది. కాంగ్రెస్‌కు ఇద్దరు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నా రు. బీజేపీ, ఎంఐఎం పార్టీల వ్యూహాం ఎలా ఉన్నా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌నే వరిస్తుందంటున్నారు.
-
కౌన్సిల్ మేజిక్ ఫిగర్ 97
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరగాలంటే.. మొత్తం 193 మందికి గాను 97 మంది సభ్యులు ఉండాల్సిందే. ఇక పార్టీల వారీగా బలబలాలను పరిశీలిస్తే.. 150 డివిజన్లలో 56 స్థానాలను గెలిచి అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించింది. బీజేపీ 48 వార్డుల్లో విజయం సాధించగా, ఎంఐఎంకు 44, కాం గ్రెస్ రెండు వార్డుల్లో గెలుపొందింది. లింగోజిగూడ కార్పొరేటర్‌గా విజయం సాధించిన బీజేపీకి చెందిన ఆకుల రమేశ్ గౌడ్ ఇటీవల మరణించారు. దీంతో 149 సభ్యులకు కౌన్సిల్ పరిమితమైంది. ఈ క్రమంలోనే మేజిక్ ఫిగర్ 97కి చేరింది.
-
మరికాసేపట్లో మేయర్ ఎన్నిక
మరికాసేపట్లో జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరగనుంది. మొత్తం 193 మందికి గాను 97 మంది సభ్యులు ఉంటేనే ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తామని పీవో, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి స్పష్టం చేశారు. ఏ అభ్యర్థికి ఎక్కువ మంది చేతులెత్తి మద్దతు తెలుపితే వారినే మేయర్‌గా ప్రకటిస్తామన్నారు. ఇదే విధానం డిప్యూటీ మేయర్ ఎన్నికకు కూడా ఉంటుందన్నారు.
-
బల్దియా మేయర్‌గా విజయలక్ష్మీ.. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత
జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మీ ఎన్నిక లాంఛనం కానుంది. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా రెండోసారి గెలిచిన గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పదవి వరించనుంది. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు కూతురు అయిన విజయలక్ష్మీ టీఆర్ఎస్ పార్టీలో క్రీయాశీలకంగా ఎదిగారు. మేయర్‌గా ఎన్నికైతే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అవుతారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్‌ఎస్ డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిను ఖరారు చేసినట్లు సమాచారం.
-
కౌన్సిల్ హాల్ నుంచి అర్థంతరంగా వెళ్లిపోయిన విజయారెడ్డి
జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ నుండి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి అర్థంతరంగా వెళ్లిపోయారు. కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె కోసం పార్టీ నేతలు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఫోన్‌లో కూడా అందుబాటులో లేరని సమాచారం.
-
కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం పూర్తి
జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల చేత పీవో, కలెక్టర్ శ్వేత మహంతి ప్రమాణస్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
-
కొనసాగుతన్న కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి నూతన కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. కార్పొరేటర్లు ఆయా భాషల్లో సామూహికంగా ప్రమాణం చేశారు. మొదట తెలుగు భాష, తర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు.
-
మజ్లిస్ కార్పొరేటర్లకు అధినేత అసదుద్దీన్ దిశానిర్ధేశం
ఎంఐఎం కార్పొరేటర్లు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో సమావేశమయ్యారు. కార్పొరేటర్లకు ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దిశానిర్ధేశం చేశారు. కౌన్సిల్ హాల్‌లో కార్పొరేటర్లు అనుసరించాల్సిన వ్యుహన్ని వివరించారు. మజ్లిస్ పార్టీకి 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్‌ఆఫీషియో సభ్యులు ఉన్న నేపథ్యంలో మొత్తం 54 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. సమావేశం అనంతరం అందరూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు.
-
పోటీలో ఉంటామంటున్న బీజేపీ, మజ్లిస్
మరోవైపు 48 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీ నుంచి గెలిచిన లింగోజిగూడ డివిజన్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇద్దరు ఎక్స్‌అఫిసియే సభ్యులతో కలిపి ఆ పార్టీకి మొత్తం 49 మంది సభ్యుల బలం ఉంది. ఇక మజ్లిస్ పార్టీ నుంచి 44 మంది కార్పొరేటర్లు గెలిచారు. అదనంగా 10 మంది ఎక్స్‌అఫిసియే సభ్యుల బలం ఆ పార్టీకి ఉంది. దీంతో ఆ పార్టీ బలం 54.
-
కోరంపై కొనసాగుతున్న టెన్షన్
149కు 44 మంది ఎక్స్‌అఫిసియే సభ్యులు తోడైతే.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల సంఖ్య 193. మేయర్ ఎన్నిక జరగాలంటే 97 మంది సభ్యుల కోరం ఉంటే సరిపోతుందంటున్నారు అధికారులు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. లేదంటే.. రేపటికి వాయిదా పడుతుంది. 56 మంది సభ్యుల బలం టీఆర్‌ఎస్‌కు 32 మంది ఎక్స్‌అఫిసియే సభ్యులు ఉన్నారు. అయితే అందులో రాజ్యసభ సభ్యులు డీఎస్ వస్తారా.. లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఆపార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య 87.
-
ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం
కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు బల్దియా కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. 149 మంది కార్పొరేటర్లు సహా.. ఎక్స్‌అఫీసియో మెంబర్లు, అధికారులంతా ఆశీలయ్యారు. ప్రమాణమే తరువాయి.. ఇక ఇవాళ్టి అసలు సమావేశం 12గంటలకు మొదలు కానుంది.
-
బల్దియా కార్యాలయానికి కొత్త కార్పొరేటర్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్ అఫిషియోలు బల్దియా సమావేశమందిరానికి చేరుకున్నారు. 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం 11.30కు మేయర్, ఉపమేయర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఈ ప్రక్రియను పీవో, జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి పర్యవేక్షిస్తున్నారు.
-
మేయర్, డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్‌కే..!
సభ్యుల సంఖ్యను బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి సులభంగా ఈ రెండు పదవులను దక్కించుకోనుంది. ఈ ఎన్నికలో తామూ పాల్గొని అభ్యర్థులను నిలబెట్టడానికి మిగిలిన రెండు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. టీఆర్ఎస్ తరపున ఎంపికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పూర్తి చేశారు. గురువారం ఉదయం సీల్డ్‌కవర్‌ను పార్టీ ఎన్నికల పరిశీలకులైన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని తెరుస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
-
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై కేటీర్ ప్రశంసలు
జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అద్భుతమైన కృషి చేశారని ఆయన అభినందించారు. మేయర్‌గా బొంతు రామ్మోహన్ పదవీ కాలం నిన్నటి ముగియడంతో ఆయన ట్వీట్ చేశారు.
Congratulations on a job well done brother ? https://t.co/DXX2XFQUt8
— KTR (@KTRTRS) February 11, 2021
-
మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి.. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత..?
హైదరాబాద్ నగరమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గ్రేటర్ మేయర్, ఉప మేయర్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. జీహెచ్‌ఎంసీ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా బంజారాహిల్స్ కార్పొరేటర్, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని ఎంపిక చేసినట్టు సమాచారం. డిప్యూటీ మేయర్ అభ్యర్థి కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తార్నాక డివిజన్ నుంచి గెలుపొందిన మోతె శ్రీలతను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినాయకత్వం ఖరారు చేసినట్లు సమాచారం. మరికాసేపట్లో జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వారిని ఎన్నికునే అవకాశముంది.
-
బషీర్‌బాగ్ కనకదుర్గ అమ్మవారికి బీజేపీ కార్పొరేటర్ల పూజలు
బీజేపీ నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను అగ్రనాయకులు మరోసారి పరిశీలించి గురువారం ఉదయం ఖరారు చేసింది. బీజేపీ కార్పొరేటర్లు అందరూ బషీర్‌బాగ్ చౌరాస్తాలోని కనకదుర్గ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పూజల అనంతరం సమీపంలోని ఓ హోటల్‌లో కార్పొరేటర్లకు ఫలహారం ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడి నుంచి ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు నాయకత్వంలో జీహెచ్‌ఎంసీకి బయలు దేరుతారు.
-
మేయర్ ఎవరైనా స్వాగతించాలిః కేటీఆర్
తెలంగాణ భవన్ కార్పొరేటర్ల తో సమావేశంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి మనం అందరం కట్టుబడి ఉండాలని మంత్రి కార్పొరేటర్లకు సూచించారు. మొదటి దారి ఉద్యమంలో కీలకంగా బొంతు రామ్మోహన్, బాబా ఫేషియోద్దీన్ లకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా మనం స్వాగతించాలని మంత్రి కేటీఆర్ కార్పొరేటర్లకు తెలిపారు.
-
మేయర్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి
మేయర్ ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30గంటలకు ఎన్నిక జరుగనుంది. డిసెంబర్‌లో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 56 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. బీజేపీ 47, కాంగ్రెస్ 2, ఎంఐఎం 44 కార్పొరేటర్ స్థానాల్లో గెలుపొందాయి. టీఆర్‌ఎస్‌కు 32 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులుండగా.. ఎంఐఎంకు 10, బీజేపీకి ఇద్దరు ఉన్నారు.
-
ఎంఐఎం పోటీపై అందరి ఆసక్తి
బీజేపీ పోటీతో మేయర్ పీఠం ఆసక్తిగా మారింది. పార్టీ మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి పేరు ఖరారు చేసింది. ఒకవేళ ఎంఐఎం కూడా బరిలోకి దిగితే… టీఆర్ఎస్ గెలుపు ఈజీ అవుతుంది. మూడు పార్టీలు బరిలో ఉంటే… ఆటోమేటిక్‌గా టీఆర్ఎస్‌కు కలిసివస్తుంది. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను గులాబీ దళం గెలుచుకోవడం సులువు అవుతుంది. ఒకవేళ ఎంఐఎం పోటీ చేయకపోతే ఎవరి వ్యూహం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
-
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ఇలా…
⚜ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం.
⚜ కార్పొరేటర్లు పదవీ ప్రమాణ స్వీకారం.
⚜ మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం.
⚜ 97 మంది సభ్యులు హాజరైతేనే ఎన్నిక ప్రక్రియ మొదలు.
⚜ సభ్యుల కోరం లేకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరునాటికి సమావేశం వాయిదా
⚜ ఎన్నిక ప్రక్రియలో భాగంగా మేయర్ పదవి కోసం పోటీదారుల పేర్లను ప్రిసైడింగ్ తీసుకుంటారు.
⚜ మేయర్‌గా పోటీ చేసే వ్యక్తి పేరును ఒకరు ప్రతిపాదిస్తే.. మరొకరు బలపర్చాల్సి ఉంటుంది.
⚜ గుర్తింపు పొందిన పార్టీ నుంచి మేయర్ పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తి సంబంధిత పార్టీ అధ్యక్షుని ధృవీకరణతో కూడిన ఫారం-ఏ, ఫారం-బీ పత్రాలు ప్రిసైడింగ్ అధికారికి సమర్పించాలి.
⚜ ఒకరి కంటే ఎక్కువ మంది పేర్లు నమోదు చేసుకున్న పక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు.
⚜ తెలుగు అక్షర క్రమం ప్రకారం ఒక్కో వ్యక్తి పేరు చెప్పి మద్దతిచ్చేది ఎంత మందన్నది చేతులెత్తే విధానం ద్వారా లెక్కిస్తారు. ఇందుకోసం రో ఆఫీసర్లను నియమించారు.
⚜ సమావేశంలో ఉన్న సభ్యుల్లో ఎక్కువ మంది మద్దతున్న వారు మేయర్‌గా ఎన్నిక.
⚜ ఇదే తరహాలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ.
⚜ కోరం లేక రెండు సార్లు సమావేశం వాయిదా పడిన పక్షంలో ఎన్నికల సంఘానికి ప్రిసైడింగ్ అధికారి నివేదిక.
⚜ ఆతర్వాత ఎన్నికల సంఘం ఖరారు చేసిన తేదీన కోరం లేకున్నా.. మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు.
-
మేయర్ పీఠంపై మూడు పార్టీల కన్ను
సాఫీగా సాగిపోవాల్సిన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ఈసారి చాలా సిత్రాలను కళ్లకు గడుతోంది. మూడు పార్టీలూ పోటాపోటీగా ఉండడంతో.. అసలది వ్యూహమో, ఎవరికి వారు గెలవాలన్న తాపత్రయమో అన్నప్రశ్న తలెత్తుతోంది. పొత్తు లేదని చెప్పుకునే ప్రయత్నాలు, పొత్తు లేకుండానే సహకరిస్తున్న సీన్స్.. ఈ మేయర్ ఎన్నికల వేళ కనిపిస్తున్నాయా. టగ్ ఆఫ్ వార్‌గా మారింది.
-
మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం టెన్షన్ పుట్టిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల పోటీ పడుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం పోటీ చేస్తామని బీజేపీ ప్రకటనతో టెన్షన్ మొదలైంది. ఎన్నికకు సంబంధించి కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు టీఆర్‌ఎస్, ఎంఐఎం విప్ జారీ చేశాయి. డిసెంబర్ 4న ప్రకటించిన ఫలితాల్లో 56 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది టీఆర్ఎస్ . బీజేపీకి 48, ఎంఐఎంకు 44, కాంగ్రెస్‌కు 2 డివిజన్లు దక్కాయి.
-
కాసేపట్లో 149 మంది కార్పొరేటర్లు ప్రమాణం
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు కార్పొరేటర్లు. కాసేపట్లో 149 మంది కార్పొరేటర్లు ప్రమాణం చేస్తారు. మధ్యాహ్న 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం స్పెషల్ మీటింగ్ పెడతారు. మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహణ కోసం కలెక్టర్ శ్వేతామహంతి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. కౌన్సిల్‌లో 150 స్థానాలకు గాను ప్రస్తుతం 149 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 44 మంది ఎక్స్‌అఫీషియోలు సభ్యులుగా ఉన్నారు. లింగోజిగూడ డివిజన్ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ కరోనాతో చనిపోయారు.
Published On - Feb 11,2021 1:56 PM