ఫైజర్ వ్యాక్సిన్‌కు ఓకే చెప్పిన మరో గల్ఫ్ దేశం.. టీకా అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒమన్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది అమెరికా. కరోనా రాకాసి నుంచి విముక్తి కలిగించేందుకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను ఆమోదించాయి. తాజాగా ఈ జాబితాలో మరో దేశం వచ్చి చేరింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది అమెరికా. కరోనా రాకాసి నుంచి విముక్తి కలిగించేందుకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను ఆమోదించాయి. తాజాగా ఈ జాబితాలో మరో దేశం వచ్చి చేరింది. ఒమన్ కూడా ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ దిగుమతి, అత్యవసర వినియోగానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్.. ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లైసెన్స్ జారీ చేసింది. అలాగే, 16 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకా ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు వ్యాక్సిన్ వినియోగంపై ప్రజల అభిష్టానికే వదిలివేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సయీది ఈ నెల చివరి వారం వరకు ఒమన్‌లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
ఇదిలావుంటే, ఫైజర్ వ్యాక్సిన్ ఒమన్ దేశం చేరాక, ముందుగా ఫ్రంట్ లైన్ మెడికల్ స్టాఫ్, బేసిక్ సర్వీస్ ప్రొవైడర్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రోగనిరోధ శక్తి తక్కువగా ఉన్నవారు, 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, ఉబకాయస్థులు, ఇంటెన్సివ్ కేర్‌లోని ఆరోగ్య కార్యకర్తలు, కొవిడ్ వార్డులలో పనిచేసే కార్మికులకు మొదట వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, దేశ పౌరులందరికీ పూర్తి ఉచితంగా టీకా అందిస్తామన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ పట్ల సమాజ వైఖరి, ఆమోదయోగ్యత గురించి తెలుసుకోవడానికి ఒమన్ ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వే ప్రజలలో అవగాహనను కలిగిస్తుందని, తద్వారా టీకా గురించి అపోహను తొలగించడానికి ప్రయత్నిస్తుందని మంత్రి తెలిపారు.