చికెన్, గుడ్లు తినొచ్చు, ఏపీలో బర్డ్ ఫ్లూ లేదు, వలస పక్షులతో అప్రమత్తంగా ఉన్నాం: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఏపీ పశుసంవర్ధక శాఖ అలెర్ట్ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ..
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఏపీ పశుసంవర్ధక శాఖ అలెర్ట్ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ టీవీ9కు వెల్లడించారు. ఏపీలో ఇప్పటివరకు ఎక్కడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనపడలేదన్న ఆయన, దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వచ్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. అందరూ చికెన్, గుడ్లు ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చని స్పష్టం చేశారు. వలస పక్షుల వల్ల ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో అటవీశాఖతో పాటుగా, పశుసంవర్ధక శాఖ పరంగా అప్రమత్తంగా ఉన్నామని అమరేంద్ర కుమార్ వెల్లడించారు. అటవీశాఖ అధికారుల నుండి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నామన్న ఆయన, అనుమానిత లక్షణాలు కనిపిస్తే శాంపిల్స్ ని భోపాల్ కు పంపిస్తామని తెలిపారు. వలస పక్షుల వల్లే బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉందని, దీని కారణంగా శాఖా పరంగా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. వసల పక్షులు వచ్చే ప్రాంతాల అధికారులకు ఇప్పటికే ఈ మేరకు ప్రత్యేక ఆదేశాలు జారీచేశామన్నారు.