Telangana Rains : నిర్మల్ జిల్లా ఆటోనగర్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..! బైంసా యువత సాయంతో ప్రాణాలతో బయటపడ్డ 12 మంది పోలీసులు
నిర్మల్ జిల్లా బైంసా ఆటోనగర్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ సహాయక చర్యల్లో బాసరకు చెందిన 12 మంది గజ ఈతగాళ్లు పాల్గొని కార్యక్రమాన్ని సఫలం చేశారు...
Nirmal Autonagar Rescue Operation : నిర్మల్ జిల్లా బైంసా ఆటోనగర్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ సహాయక చర్యల్లో బాసరకు చెందిన 12 మంది గజ ఈతగాళ్లు పాల్గొని కార్యక్రమాన్ని సఫలం చేశారు. రెండు నాటు పడవల్లో 4 గంటలు శ్రమించి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 22 మంది పోలీసులతోపాటు, బైంసా యువత సైతం ఎంతో సాయం అందించింది. బాధితులను బైంసాలోని ఎస్సీ హస్టల్ పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు.
కాగా, బక్రీద్ పండుగ వేళ భద్రతా చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆదిలాబాద్ బెటాలియన్‌కు చెందిన 12 మంది పోలీస్ సిబ్బంది నిర్మల్ పట్టణంలోని ఆటోనగర్లో ఆశ్రయం పొందుతూ పీకల్లోతు వరద నీటిలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చే వీలు లేకపోవడంతోపాటు, మరోవైపు వరద నీటి ప్రవాహ పెరుగుతుండటంతో పోలీసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిపారు. ఈ తరుణంలో గజ ఈతగాళ్లతో కలిసి వెళ్లి 12 మంది పోలీసులను ఒడ్డుకు చేర్చారు ఏఎస్పీ కిరణ్ ఖారే.
పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న గజ ఈతగాళ్లకు, పోలీసులకు, లోకల్ యువతకు, ఆటోనగర్ బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఉండగా, గడ్డన్న వాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఆటోనగర్‌ను వరద నీరు ముంచెత్తింది. గత పదేళ్లలలో ఇలాంటి వరదను చూడలేదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి టీవీ9కు వెల్లడించారు.