న్యూఢిల్లీ: సమాజ్ వాద్ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలకు లోక్‌సభ ఆశ్చర్యపడింది. ఎన్డిఏ పక్షాలు సంతోషపడగా, విపక్షాలు మాత్రం షాకయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ పరిపాలన బాగుందని, అందర్నీ కలుపుకుని వెళ్తున్నారని పొగిడారు. 2019లో కూడా ఆయన మరోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
దీంతో ములాయం వ్యాఖ్యలకు ప్రధాని మోడీ తన సీటు నుంచే నమస్కారం చేశారు. ఇక్కడ మరో రెండు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ములాయం మాట్లాడుతున్నంతసేపూ సభలో నవ్వులు వినిపించగా ఆయన పక్కనే కూర్చొన్న సోనియా గాంధీ మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంకొకటి ఒకపక్క ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ములాయం మాత్రం ఈ విధంగా ప్రధానిని పొగడ్తల్లో ముంచెత్తడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది.