Prakasam: శవాన్ని డోర్ డెలివరీ చేసి.. అంత్యక్రియల ఖర్చుల కోసం 35 వేలు పెట్టి.. ఎస్కేప్

మృతుడు శ్రీను వారం రోజుల క్రితం పనుల నిమిత్తం ఊరు విడిచి వెళ్ళాడు. పనులు పూర్తి చేసుకుని శ్రీను ఇంటికి వస్తాడనుకుంటే అతడి శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీలా ఇంటిముందు పడేసి వెళ్ళారు.

Prakasam: శవాన్ని డోర్ డెలివరీ చేసి.. అంత్యక్రియల ఖర్చుల కోసం 35 వేలు పెట్టి.. ఎస్కేప్
Deceased Srinu
Follow us

|

Updated on: Jun 02, 2023 | 5:46 PM

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో 35 ఏళ్ళ ఉప్పు శ్రీను అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకొచ్చి డోర్‌ డెలివరీ చేశారు. ఒంటిపై గాయాలతో అనుమానాస్పద స్ధితిలో మృతి చెంది ఇంటి ముందు పడి ఉన్న శ్రీను మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. అంతే కాకుండా మృతదేహం పక్కన 35 వేలు ఉంచి దహన సంస్కారాలు చేయడానికన్నట్టుగా డబ్బులు ఉంచడంతో గ్రామస్తులు ఎక్కడో చనిపోతే ఇక్కడకు తీసుకొచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. మరోవైపు హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా… అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మృతుడు శ్రీను వారం రోజుల క్రితం పనుల నిమిత్తం ఊరు విడిచి వెళ్ళాడు. పనులు పూర్తి చేసుకుని శ్రీను ఇంటికి వస్తాడనుకుంటే అతడి శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీలా ఇంటిముందు పడేసి వెళ్ళారు. మృతదేహం పక్కనే 35 వేలు పెట్టి.. మట్టి ఖర్చుల కోసమంటూ లెటర్ రాసి పెట్టి వెళ్ళిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో కలకలం రేపింది. ఉప్పు శ్రీనురెండేళ్ళ నుండి భార్యకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పనుల కొరకు వేరే ప్రాంతానికి వెళుతున్నానని తల్లిదండ్రులైన లింగాలు, వెంకటరత్నంకు చెప్పి వెళ్ళాడు. తీరా ఒంటిపై గాయాలతో శవమై ఇంటి ముందు పడి తల్లిదండ్రులకు దర్శన మిచ్చాడు. మృతుని తల్లి వెంకటరత్నం మాట్లాడుతూ, పక్కింటి వారు చెప్పే వరకు మా ఇంటిముందు కొడుకు శవం ఉందని తమకు తెలియదని, పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి ఇలా శవమై వచ్చాడని ఆవేదనగా తెలిపింది.

సిఐ మారుతి కృష్ణ మృతదేహాన్ని పరిశీలించారు.  అర్ధరాత్రి వచ్చిన సమాచారంతో ముటుకులకు వెళ్ళామని శ్రీను శవం దుప్పట్లో చుట్టి పడేసి ఉందని సిఐ తెలిపారు. తండ్రి లింగాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి సమాచారం తెలుపుతామన్నారు. కూలిపనుల కోసం వెళ్ళిన కొడుకు శవాన్ని డోర్ డెలివరీ చేయడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు తమ కొడుకు మృతిపై పోలీసులు పూర్తి వివరాలు రాబట్టాలని కోరుతున్నారు.

ఫైరోజ్, ప్రకాశం జిల్లా 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం