భూమి మీద నూకలు ఉన్నాయంటే ఇదే మరీ..! 10వ అంతస్తు నుంచి పడినా.. ప్రాణాలు సేఫ్!
ముంబైలోని భాండూప్ ప్రాంతంలో ఓ మహిళ 10వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె నేరుగా నేలపై పడకుండా భవనం కింద ఉన్న పెద్ద చెట్టు కొమ్మల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను సురక్షితంగా రక్షించారు. ఆమె ఎలా పడిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. భాండూప్ ప్రాంతంలోని సన్‌షైన్ ఎస్ఆర్‌ఏ భవనంలో ఓ మహిళ 10వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె నేరుగా నేలపై పడకుండా భవనం కింద ఉన్న ఓ పెద్ద చెట్టు కొమ్మల్లో చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది.
స్థానికుల సమాచారం ప్రకారం.. మహిళ అకస్మాత్తుగా భవనం 10వ అంతస్తు నుంచి కిందపడింది. అంత ఎత్తు నుంచి పడటంతో తీవ్ర పరిణామాలు తప్పవని భావించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే భవనం కింద ఉన్న చెట్టు కొమ్మల్లో ఆమె చిక్కుకున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎత్తైన చెట్టు కొమ్మల్లో చిక్కుకున్న మహిళను గుర్తించిన సహాయక బృందాలు ఎంతో జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మహిళకు మరిన్ని గాయాలు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించి, చివరకు ఆమెను చెట్టు కొమ్మల నుంచి సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.
10వ అంతస్తు నుంచి పడినప్పటికీ చెట్టు కొమ్మలు ఆమెను అడ్డుకోవడంతోనే ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ ఆమె నేరుగా నేలపై పడి ఉంటే పరిస్థితి మరింత విషమంగా ఉండేదని పేర్కొన్నారు. అయితే మహిళకు ఎలాంటి గాయాలయ్యాయి, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు వెంటనే వెల్లడికాలేదు.
ఇదిలా ఉండగా.. అసలు మహిళ 10వ అంతస్తు నుంచి ఎలా కిందపడిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ప్రమాదవశాత్తూ పడిపోయిందా? లేక ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు మహిళ వాంగ్మూలంతో పాటు సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
