పాలమూరులో పచ్చ పార్టీ ఖతం.. వీరూ త్వరలోనే..
తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లా ఒకప్పుడు కంచుకోట… దశాబ్దాల చరిత్ర ఉండి.. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లాలో ఇపుడు తెలుగుదేశం పార్టీ అంపశయ్యకు చేరింది. కీలకనేతలంతా ఇతర పార్టీల్లో చేరారు. నిన్న మొన్నటి వరకు పార్టీని అంటి పెట్టుకొని ఉన్న మరికొంత మంది నేతలు కూడా బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. దీంతో పాలమూరు జిల్లాలో పచ్చ పార్టీ పత్తా లేకుండా పోనుందనే చర్చ జరగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ ఒకప్పుడు […]
తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లా ఒకప్పుడు కంచుకోట… దశాబ్దాల చరిత్ర ఉండి.. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లాలో ఇపుడు తెలుగుదేశం పార్టీ అంపశయ్యకు చేరింది. కీలకనేతలంతా ఇతర పార్టీల్లో చేరారు. నిన్న మొన్నటి వరకు పార్టీని అంటి పెట్టుకొని ఉన్న మరికొంత మంది నేతలు కూడా బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. దీంతో పాలమూరు జిల్లాలో పచ్చ పార్టీ పత్తా లేకుండా పోనుందనే చర్చ జరగుతోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ ఒకప్పుడు తెలుగుదేశం బలంగా ఉండేది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పార్టీ రోజు రోజుకు బలహీన పడింది. జిల్లాలో కీలక నేతలు ఇతర పార్టీల్లో చేరారు. ఒకరిద్దరు బలమైన నేతలు పార్టీని అంటి పెట్టుకొని ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వారు కూడా పార్టీ మారేందుకు సిద్ధమౌతున్నారని విశ్వసనీయ సమాచారం.
ఉమ్మడి పాలమూరులో ఇప్పటి వరకు టీడీపీలో ఉన్న నేతలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి. ఈ ఇద్దరు నేతలు కూడా పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారని చర్చ జరుగుతోంది. కమల దళంలో చేరేందుకు సిద్ధమౌతున్నారని తెలుస్తోంది. అందుకు ఢిల్లీ స్థాయిలో మంతనాలు కూడా జరుగుతున్నయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వీరు ఎక్కడా చురుకుగా పాల్గొన్న దాఖలాలు లేవు. దీంతో వీరు పార్టీ మారుతున్నారనే ప్రచారం మొదలైంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ ఉద్దండుల్లా పేరున్న టిడిపి నేతలంతా ఎన్నికలకు ముందే ఇతర పార్టీల్లోకి చేరారు. నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పి. రాములు, ఎర్రశేఖర్ లాంటి నేతలంతా పార్టీ పరిస్థితి బలహీన పడుతున్న నేపధ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇతర పార్టీల్లో చేరారు. అయితే కొత్తకోట దంపతులతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే టిడిపిని అంటిపెట్టుకొని ఇన్నాళ్లు కొనసాగారు.
అయితే తెలంగాణాలో టిడిపికి ఉనికి లేకపోవడంతో ప్రస్తుతం వీరు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ టిక్కెట్ల పై స్పష్టమైన హామీ రాకపోవడంతో తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని టీడీపీలోనే కొనసాగారట.
అయితే ఎన్నికల తర్వాత తెలంగాణాపై ఫోకస్ పెట్టి కీలక నేతలను చేర్చుకునే పనిలోపడింది బీజేపీ. ఇందులో భాగంగా దయాకర్ రెడ్డి దంపతులను బీజేపీలో చేర్చుకోవడానికి చర్చలు జరిపారని సమాచారం. రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు బలంగా ఉండడంతో పాటు ఆ పార్టీల్లో రావుల చంద్రశేఖర్ రెడ్డికి అవకాశం లేకపోవడం వల్ల ఆయన కూడా కమలం వైపు చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు.