చిన్న నగరాల్లో ఇక లైట్ మెట్రో.. కసరత్తు చేస్తున్న కెటీఆర్

హైదరాబాద్ మినహా తెలంగాణ నగరాల్లో ఎక్కడా లోకల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ పక్కాగా లేదు. తాజాగా రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి కె.టి.రామారావు ఆ విషయంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్ వంటి చిన్న నగరాల్లో ఇంప్లిమెంట్ చేయనున్న మెట్రో నియో (లైట్ మెట్రో) సంస్థ ప్రతినిధులు, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కెటీఆర్ భేటీ అయ్యారు. మహా మెట్రో సంస్థ ప్రతిపాదనల మాదిరే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎర్పాటు చేయగలిగే మెట్రో […]

చిన్న నగరాల్లో ఇక లైట్ మెట్రో.. కసరత్తు చేస్తున్న కెటీఆర్
Rajesh Sharma

| Edited By: Srinu Perla

Dec 10, 2019 | 1:55 PM

హైదరాబాద్ మినహా తెలంగాణ నగరాల్లో ఎక్కడా లోకల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ పక్కాగా లేదు. తాజాగా రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి కె.టి.రామారావు ఆ విషయంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్ వంటి చిన్న నగరాల్లో ఇంప్లిమెంట్ చేయనున్న మెట్రో నియో (లైట్ మెట్రో) సంస్థ ప్రతినిధులు, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కెటీఆర్ భేటీ అయ్యారు.

మహా మెట్రో సంస్థ ప్రతిపాదనల మాదిరే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎర్పాటు చేయగలిగే మెట్రో లైట్, మెట్రో నియో వంటి ప్రతిపాదనలను అధ్యయనం చేయాలని మంత్రి తెలంగాణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహరాష్ర్టలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మెట్రో ఏర్పాట్లకు భాద్యత వహిస్తున్న మహా మెట్రో అధికారులు కెటీఆర్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌కు తెలంగాణ పురపాలక శాఖ అధికారులు, మెట్రోరైల్ సంస్ధ అధికారులు హాజరయ్యారు.

నాసిక్ లాంటి పట్టణాల్లో తలపెట్టిన మెట్రో నియో ప్రాజెక్టుపైన మహమెట్రో అధికారులు వివరాలందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న అర్టీసీ, మెట్రో, ఎంఎంటియస్, భవిష్యత్తులో రానున్న బిఅర్టియస్, మెట్రో రెండవ దశ మార్గాలు, ఇంటర్ సిటీ బస్ టెర్మినళ్లను కలపుతూ సమగ్ర ప్రజారవాణ వ్యవస్ధ బలోపేతంపైన నివేదిక ఇవ్వాలని కెటీఆర్ నిర్దేశించారు. హైదరాబాద్ నగరంలోనూ భూసేకరణ వ్యయం తగ్గించేందుకు, భవిష్యత్తు అవసరాల కోసం నాగపూర్ మాదిరే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పరిశీలించాలని మంత్రి పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.

మహారాష్ట్ర నాసిక్, పూణే, నాగపూర్ వంటి నగరాల్లో మెట్రో ఏర్పాటు కార్యక్రమాలను తామే నిర్వహిస్తున్నామని, వాటి కోసం చేపట్టిన కార్యక్రమాలు, నిర్మాణం తాలుకు వివరాలతో మహా మెట్రో అధికారులు ఒక సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో వ్యవస్థకి కొంత భిన్నంగా, అతి తక్కువ ఖర్చుతో “మెట్రో నియో” పేరుతో నాసిక్ పట్టణంలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు వివరాలను ఈ సమావేశంలో మంత్రికి, పురపాలక శాఖాధికారులకు అందించారు. ప్రస్తుతం తాము సిద్ధం చేస్తున్న ఈ ప్రతిపాదనలతో ప్రాజెక్టు వ్యయం ఘననీయంగా తగ్గుతుందని, స్వల్ప కాలంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.

సాంప్రదాయ మెట్రోలో రైల్వే కోచ్ లు ఉపయోగిస్తుండగా ప్రస్తుతం తాము ప్రతిపాదించిన మెట్రోలో ఎలక్ట్రిక్ బస్సు కోచ్ లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఎలివేట్ కారిడార్ లతో పాటు ప్రస్తుతం ఉన్న రోడ్ల పైన కూడా ఈ మెట్రో నడుస్తుందని తెలిపారు. 350 నుంచి 400 మంది ప్రయాణికులు ఒకే సారి ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం నాసిక్ లో తమ ప్రతిపాదనల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కోచ్ వచ్చేందుకు అవకాశం ఉందని, దీన్ని రెండు నిమిషాలకు ఒకసారి కోచ్ లు వచ్చేలా చేసేందుకు కూడా వీలుందన్నారు.

మహా మెట్రో అధికారులు అందించిన ప్రజంటేషన్‌పై పురపాలక శాఖ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మధ్య కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసినప్పుడు ద్వితీయ శ్రేణి పట్టణాలలో మెట్రో లైట్, మెట్రోనియో వంటి ప్రతిపాదనలకు సహాయం అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారని కెటీఆర్ అన్నారు. ఈనేపథ్యంలో నాసిక్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన మెట్రో నియో లాంటి ప్రతిపాదనలు సూటవుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ నగరం కోసం తాజాగా యోచిస్తున్న ఎలివేటేడ్ బిఅర్టియస్ ప్రతిపాదనల రూపకల్పనలో మహ మెట్రో సంస్థ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. దీంతోపాటు మహ మెట్రో సంస్ధ పాటిస్తున్న వంద శాతం లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్దతులు, మెట్రో స్టేషన్లపైన సోలార్ విద్యుత్ ఉత్పాదన, తక్కువ భూసేకరణ ఖర్చు వంటి అంశాలను ఈ ప్రతిపాదనల్లో పరిశీలించాలన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu