ఏంటి నాగన్న.. అలా ఎలా దూరావ్.. కాళ్ల దగ్గర తోక చూసి గుండె ఆగినంత పనైంది.. ఇదిగో వీడియో
పెద్దపెల్లి జిల్లాలోని రామగుండంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ కింద పాము కనిపించడం కలకలం రేపింది. వంట చేస్తున్న మహిళకు సిలిండర్ కింద తోక కనిపించడంతో పరిశీలించగా పాము చుట్టుకొని ఉండటాన్ని చూసి భయంతో బయటకు పరుగులు పెట్టింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నవీన్ అక్కడికి చేరుకుని దాదాపు ఐదు అడుగుల పొడవున్న పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు.

పాము అంటే అందరికీ భయమే.. పాము కరిస్తే ప్రాణాలు కోల్పోతామన్న భయంతో దానిని చూస్తేనే జనం హడలెత్తిపోతారు. అలాంటి పాము తెలియకుండానే మన సమీపంలోనే ఉందంటే ఆ వ్యక్తి పడే కంగారు అంతా ఇంతా కాదు.. ఆ దరిదాపుల్లో కూడా ఉండరు.. సరిగ్గా ఇలాంటి ఘటనే పెద్దపెల్లి జిల్లా రామగుండంలో చోటుచేసుకుంది. ఇంట్లో వంట చేస్తున్న ఓ మహిళకు గ్యాస్ బండ కింద తోక మాదిరిగా బయటకు కనిపించింది. ఏదో మామూలు బల్లి అనుకున్న ఆ మహిళ యథావిధిగా వంట పనిలో నిమగ్నమైంది. ఆ తర్వాత తోక భాగం కదులుతూ ఉండడంతో అనుమానం వచ్చిన మహిళ, గ్యాస్ బండను ఒక వైపుగా చూసింది. అక్కడ కనబడ్డ దృశ్యాన్ని చూసి ఆ మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అయింది. గ్యాస్ బండ కింద భాగంలో అత్యంత హానికరమైన కింగ్ కోబ్రా (పాము) చుట్ట చుట్టుకొని కనిపించింది.
ఈ దృశ్యం చూసి భయంతో బిగ్గరగా అరుచుకుంటూ బయటకు పరుగులు పెట్టిన మహిళ.. ఇరుగు పొరుగు వారికి గ్యాస్ బండ కింద పాము ఉన్న విషయం తెలియజేసింది. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు పట్టణంలోని విద్యుత్ నగర్ కు చెందిన స్నేక్ క్యాచర్ నవీన్ వచ్చి గ్యాస్ బండ కింద ఉన్న ఐదు అడుగుల పామును తన నైపుణ్యంతో డబ్బాలో బంధించాడు. ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు తరలివచ్చారు.
వీడియో చూడండి..
ఈ క్రమంలో గంటపాటు పాము ఉన్న ఇంటి వద్ద సందడి వాతావరణం కనిపించింది. డబ్బాలో బంధించిన పామును స్నేక్ క్యాచర్ నవీన్ తన వెంట తీసుకువెళ్లి జనావాసాలకు దూరంగా అడవిలో వదిలిపెట్టాడు. దీంతో ఆ ఇంటి వారితో పాటు చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
