యాదగిరిగుట్ట నరసన్నకు భక్తుల కానుకల వర్షం.. వరుసగా మూడో ఏడాది రికార్డు ఆదాయం!
Yadadri Temple: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరుసగా మూడో ఏడాది రూ.200 కోట్లకు పైగా ఆదాయం సాధించి తెలంగాణలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.243 కోట్ల ఆదాయం నమోదు కాగా, భక్తుల సంఖ్య కోటి దాటింది. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు, హుండీ కానుకలు, ఆర్జిత సేవలు దేవస్థానం ఆదాయ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

Yadadri Temple Revenue: భువిపై ఇలా వైకుంఠం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రం. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న స్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్యతోపాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానం వరుసగా మూడో ఏడాది కూడా రికార్డు స్థాయి ఆదాయంతో దూసుకుపోతోంది. తెలంగాణలో 200 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని సాధిస్తున్న ఏకైక దివ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట నిలిచింది.
తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా ఉన్న స్తంభోద్భవుడు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ 1300 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించారు. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఆధునికతను జోడించి వెయ్యేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని కృష్ణ శిలలతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా పునర్మించారు. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఏకశిఖర వాసుడి సన్నిధికి రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తాకిడి ఎక్కువైంది. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు సాధారణ రోజుల్లో రోజుకు 15 వేల మంది వరకు భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు సగటున సుమారు 30 నుంచి 50 వేల మంది వరకు వస్తున్నారు. ఇక పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతోంది. 2014లో దాదాపు 86 లక్షలుగా ఉన్న వార్షిక భక్తుల సంఖ్య, ప్రస్తుతం 1.02 కోట్లకు పెరిగింది. ఇది ఆలయం పట్ల భక్తుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది.
యాదగిరిగుట్ట లడ్డూకు క్రేజ్..
తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తర్వాత అత్యంత పవిత్రమైన ప్రసాదంగా యాదగిరిగుట్ట లడ్డూను భక్తులు భావిస్తుంటారు. దీంతో యాదగిరిగుట్ట లడ్డూకు క్రేజ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో సగటున 25 నుంచి 30 వేల లడ్డూలను దేవస్థానం విక్రయిస్తోంది. సెలవు, పర్వదినాల్లో 40 నుంచి 50 వేల లడ్డూలను దేవస్థానం అమ్ముతోంది. లడ్డూతో పాటు యాదగిరిగుట్ట పులిహోర ప్రసాదానికి కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రతిరోజు రెండు టన్నుల పులిహోరను ఆలయం తయారు చేస్తోంది. ఆధునాతన ఆటోమేటెడ్ పోటు ద్వారా భక్తులకు అవసరమైన ప్రసాదాలను దేవస్థానం అందిస్తోంది. స్వామివారి ప్రసాదానికి భక్తుల నుండి భారీగా డిమాండ్ ఉండడంతో ప్రసాదాలు విక్రయాల ద్వారా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2026 మే నెలలో ప్రసాదాలు విక్రయాల ద్వారా 15.62 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఏడాదిలో నాలుగైదు సార్లు దర్శంచి స్వామి వారి కృపకు పాత్రులవుతూ స్వామివారి సేవలో భక్తులు తరిస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు లడ్డూ ప్రసాదాన్ని తీసుకువెళ్లి బంధువులకు పంచుతారు.
మూడో ఏటా కూడా 200 కోట్ల మార్క్ దాటిన ఆదాయం..
స్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్యతోపాటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వరుసగా మూడో ఏడాది కూడా రూ.200 కోట్ల మార్కును దాటి, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలోనే రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించింది. 2023-24లో 224 కోట్లు, 2024-25లో 212 కోట్లు, 2025-26లో 243 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వరుసగా మూడో ఏడాది కూడా యాదగిరిగుట్ట దేవస్థానం 200 కోట్ల రూపాయల ఆదాయ మార్క్ ను దాటింది. తెలంగాణలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా యాదగిరిగుట్ట దేవస్థానం అగ్రస్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కేవలం రూ. 61 కోట్లుగా ఉన్న ఆదాయం, నేడు నాలుగు రెట్లు పెరిగింది. యాదాద్రి ఆలయం తన ఆధ్యాత్మికతతో పాటు ఆర్థికంగా కూడా అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది.
దేవస్థానంలో ఆన్‌లైన్ ద్వారా ఆర్జిత సేవలు, కల్యాణోత్సవాల బుకింగ్ సదుపాయం కల్పించడం వల్ల భక్తులు సులభంగా సేవల్లో పాల్గొనే అవకాశం కలిగింది. దీంతో హుండీ కానుకలు, దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు, వివిధ కైంకర్యాల ద్వారా వచ్చే ఆదాయం ఆలయ ఆర్థిక బలాన్ని పెంచింది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం, మెరుగైన వసతులు, వివిధ రకాల సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం వల్ల దేవస్థానానికి ఆదాయం స్థిరంగా పెరుగుతోందనీ ఆలయ అధికారులు చెబుతున్నారు.




