AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహ్ కేసీఆర్.. వాట్ ఏ స్ట్రాటజీ?

కేసీఆర్ ఏ అడుగు వేసినా ఎంత వ్యూహాత్మకంగా వుంటుందో అంతే అనూహ్యంగా వుంటుంది. సరిగ్గా ఇదే స్టైల్‌ని మరోసారి చాటారు కేసీఆర్ తాజాగా. కేసీఆర్ సోమవారం నాడు వేములవాడ పుణ్యక్షేత్రానికి అక్కడ్నించి మిడ్ మానేర్ జలాశయానికి వెళ్ళారు. అధికారగణంతోపాటు కుటుంబ సమేతంగా కేసీఆర్ ఈ పర్యటన తలపెట్టారు. ఇందుకాయన హెలికాప్టర్ వాడకుండా బస్సును వాడుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో కేసీఆర్ చేసిన మరో చర్య అందరినీ షాక్‌కి గురిచేసింది. ఆలోచింపజేసింది. సోమవారం ఉదయం బస్సులో సీఎంఓలో […]

వాహ్ కేసీఆర్.. వాట్ ఏ స్ట్రాటజీ?
Rajesh Sharma
|

Updated on: Dec 30, 2019 | 2:01 PM

Share

కేసీఆర్ ఏ అడుగు వేసినా ఎంత వ్యూహాత్మకంగా వుంటుందో అంతే అనూహ్యంగా వుంటుంది. సరిగ్గా ఇదే స్టైల్‌ని మరోసారి చాటారు కేసీఆర్ తాజాగా. కేసీఆర్ సోమవారం నాడు వేములవాడ పుణ్యక్షేత్రానికి అక్కడ్నించి మిడ్ మానేర్ జలాశయానికి వెళ్ళారు. అధికారగణంతోపాటు కుటుంబ సమేతంగా కేసీఆర్ ఈ పర్యటన తలపెట్టారు. ఇందుకాయన హెలికాప్టర్ వాడకుండా బస్సును వాడుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో కేసీఆర్ చేసిన మరో చర్య అందరినీ షాక్‌కి గురిచేసింది. ఆలోచింపజేసింది.

సోమవారం ఉదయం బస్సులో సీఎంఓలో ముఖ్య అధికారులు, కేటీఆర్ సహా మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సులో వేములవాడకు బయలుదేరారు. ప్రగతిభవన్‌ నుంచి యాత్ర ప్రారంభం కాగా.. సరిగ్గా శామీర్‌పేటకు చేరుకుంటున్న తరుణంలో బస్సును సడన్‌గా లెఫ్ట్ సైడ్‌కు తీసుకోమని ఆదేశించారు ముఖ్యమంత్రి. దాంతో ఎందుకో అర్థం కాక జనం అధికారులు, కుటుంబీకులు షాక్‌కు గురయ్యారు. కాస్త ముందుకెళ్ళగానే అందరికీ విషయం అర్థమై మరింత ఆశ్చర్యానికి గురయ్యారు.

అప్పటికే కేసీఆర్ ఆదేశాలతో అక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ తన కుటుంబీకులతో కలిసి వెయిట్ చేస్తున్నారు. ఈటల సతీమణి జమునతోపాటు ఇటీవలే వివాహం చేసుకున్న ఈటల కూతురు నీత, అల్లుడు అనూప్, మరో కుమార్తెతో కలిసి ఈటల ముఖ్యమంత్రి బస్సులోకి ఎక్కి వేములవాడకు పయనమయ్యారు. కేసీఆర్ చర్య ఆశ్చర్యానికి గురి చేయడంతోపాటు ఆయన రాజకీయ చతురతకు అద్దం పట్టింది.

కొంత కాలం క్రితం ఈటల అసంతృప్తితో వున్నారంటూ తెగ ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లాంటి వారు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఈటల అసంతృప్తిగా వున్నారన్న అంశాన్ని తెరమీదికి తెచ్చాయి. ఆ తర్వాత ఈటలకు మంత్రి పదవి దక్కిన తర్వాత అసంతృప్తికి సంబంధించిన వార్తలు కనుమరుగయ్యాయి. ఇటీవల ఈటల తన కుమార్తె నీతకు శామీర్‌పేటలోని తన ఫాంహౌజ్‌లో ఘనంగా పెళ్ళి చేశారు. ఈటల ఫామ్ హౌజ్‌ని చూసి కేసీఆర్ సైతం ఆశ్చర్యపోయారని కథనాలొచ్చాయి. ఈ క్రమంలో మళ్ళీ వారిద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్లు చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్.. సోమవారం ఈటలకు అత్యంత పెద్ద పీట వేయడం… ఆయన కుటుంబీకులను ఆప్యాయంగా తనతోపాటు బస్సులో వేములవాడకు తీసుకువెళ్ళడం, మిడ్ మానేరు ప్రోగ్రామ్‌లోను ఈటలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడంతో వారిద్దరి మధ్య ఏ గ్యాప్ లేదన్న సంకేతాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పేశారు. గాసిప్స్‌కు శాశ్వతంగా తెరదించారు. మునిసిపల్ ఎన్నికలు ముందుండడంతో ఈటలతో గ్యాప్ వుందన్న ప్రచారం బీసీ వర్గాలపై నెగెటివ్ ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేశారని పరిశీలకులు చెప్పుకుంటున్నారు.