టాలీవుడ్‌కు కేసీఆర్ అభయ హస్తం.. కరోనా కాటుకు విరుగుడు.. త్వరలో రాయితీల ప్రకటన!

టాలీవుడ్‌కు కేసీఆర్ అభయ హస్తం.. కరోనా కాటుకు విరుగుడు.. త్వరలో రాయితీల ప్రకటన!

కరోనా ప్రభావంతో కునారిల్లిపోయిన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకుంటానని హామీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. సినీ పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి...

Rajesh Sharma

|

Nov 22, 2020 | 5:33 PM

KCR helping hand to tollywood: కరోనా ప్రభావంతో కునారిల్లిపోయిన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకుంటానని హామీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. సినీ పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల జరిగిన నష్టాన్ని వివరించారు. సినీ కార్మికుల కష్టాలను విశదీకరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

‘‘ రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? దేశంలో ముంబాయి, చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతుంది. కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటు ప్రభుత్వం, అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మానిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాం’’ అని కేసీఆర్ చెప్పారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే సినీ హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమయి, సినిమా పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.

ALSO READ: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీ ఖరారు.. నిర్దిష్ట ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి

ALSO READ: సెకెండ్ వేవ్ కరోనా వ్యాప్తిపై అలర్ట్.. కేసీఆర్ కీలక సమీక్ష

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu