#Lockdown మోదీ బాటలోనే కేసీఆర్… అచ్చం అవే నిబంధనలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాటలోనే ముందుకు సాగాలని నిర్ణయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రం చూపిన మార్గంలోనే ముందుకు సాగుతూ లాక్ డౌన్‌ను ఏప్రిల్ 15వ తేదీ దాకా కొనసాగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

#Lockdown మోదీ బాటలోనే కేసీఆర్... అచ్చం అవే నిబంధనలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 27, 2020 | 5:25 PM

KCR to follow Narendra Modi footsteps: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాటలోనే ముందుకు సాగాలని నిర్ణయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రం చూపిన మార్గంలోనే ముందుకు సాగుతూ లాక్ డౌన్‌ను ఏప్రిల్ 15వ తేదీ దాకా కొనసాగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రతో సహా ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా తెలంగాణలో వుంటే వారు అక్కడే వుండిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రితో శుక్రవారం ఉదయం సుదీర్ఘంగా మాట్లాడానంటున్న కేసీఆర్.. మోదీ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రజలు ఒక చోటి నుంచి మరొక చోటికి వెళ్ళకుండా నిరోధించాలన్న ప్రధాని సూచనను తు.చ. తప్పకుండా పాటించాలని, అదే దేశంలో కరోనా వ్యాపించకుండా శ్రీరామరక్షగా మారుతుందని కేసీఆర్ అంటున్నారు. డైరీ, పౌల్ట్రీ, అక్వా రంగాలకు సంబంధించి రవాణా కొనసాగుతుందని సీఎం చెప్పారు. కూరగాయలు, పళ్ళు, నిత్యావసర వస్తువుల రవాణాను నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పారు.

తెలంగాణలో శుక్రవారం (మార్చి 27వ తేదీ సా.5 గంటల వరకు) నాటికి 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఒకరు కోలుకుని డిశ్చార్జి కాగా.. మిగిలిన 58 మంది చికిత్స పొందుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మరో 20 వేల మందిని క్వారంటైన్ చేశామని వివరించారాయన. 11 వేల ఐసోలేషన్ వార్డులను రాష్ట్రంలో సిద్దం చేశామని, పద్నాలుగు వందల ఐసీయు బెడ్స్ సిద్దం చేశామని, సుమారు 60 వేల పాజిటివ్ కేసులు ఎదురైనా కూడా వారికి చికిత్స అందించే విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్దంగా వుందని కేసీఆర్ గణాంకాలను వివరించారు.

వైద్య సౌకర్యాలతోపాటు వైద్య సిబ్బందిని కూడా తగిన స్థాయిలో రెడీ చేయాలని, అందుకోసం పదవీ విమరణ పొందిన వైద్య సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికని తిరిగి చేర్చుకుంటామని తెలిపారు. ప్రజలు లాక్ డౌన్ విధానాలను తు.చ.తప్పకుండా పాటించాలని, పోలీసులకు, అధికారులకు సంపూర్ణ సహకారమందిస్తేనే ఈ కరోనా విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కుతామని తెలిపారు ముఖ్యమంత్రి.

రబీ పంటలు చేతికి వచ్చే దశలో సాగునీరు, విద్యుత్ సరఫరా మరింత కీలకమని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ పదవ తేదీ దాకా ఎస్సీరెస్పీ, కాళేశ్వరం, జూరాల, నాగార్జునసాగర్ ఆయకట్టులకు సాగునీరు సరఫరా చేస్తామని, విద్యుత్ ఆధారిత పంటలకు విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పంట దిగుబడులు వస్తున్నందున వాటి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రైతులు తొందరపడకుండా వుంటే అందరి వద్ద ధాన్యాన్ని సేకరిస్తామని.. ఎవరూ పరేషాన్ కావద్దని కేసీఆర్ రైతులకు సూచించారు. మార్కెట్ యార్డులు పని చేస్తున్నందున వారంతా గ్రామాలకు వచ్చి ధాన్యాన్ని సేకరిస్తారని, కనీస మద్దతు ధర తప్పకుండా ఇస్తామని తెలిపారు సీఎం.

ధాన్యం సేకరణపై ఆదివారం సాయంత్రం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, తగిన విధంగా మార్గదర్శకం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కూడా రైతులకు మిగిలిపోతాయని, అందుకే రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు తొందరపడవద్దని కేసీఆర్ రైతులకు సూచించారు. కరోనా నియంత్రణలో వుంచాం.. మున్ముందు బయటి నుంచి వైరస్ అవకాశాలు లేవని, రాష్ట్రంలో సోకిన కొందరికి సోకినందున వారి నుంచి ఇతరులకు సోకకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.