ట్రంప్ టార్గెట్ ఇప్పుడు బైడెన్ కాదు..! లక్ష్యం మాత్రం ఆయనే..! ఆయన ఎవరో తెలుసా..!
ఎన్నికల్లో పరాజయం పాలైన డొనాల్డ్ ట్రంప్ దృష్టి ఇప్పుడు బైడెన్ కుమారుడు హంటర్‌పై పడింది. హంటర్‌ను లక్ష్యంగా చేసుకున్న అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కుమారుడిపై దర్యాప్తునకు ఆదేశించారు. ట్రంప్ నిర్ణయంతో...

ఎన్నికల్లో పరాజయం పాలైన డొనాల్డ్ ట్రంప్ దృష్టి ఇప్పుడు బైడెన్ కుమారుడు హంటర్‌పై పడింది. హంటర్‌ను లక్ష్యంగా చేసుకున్న అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కుమారుడిపై దర్యాప్తునకు ఆదేశించారు. ట్రంప్ నిర్ణయంతో ఎప్పటి నుంచో పన్ను ఎగవేత ఆరోపణలెదుర్కొంటున్న హంటర్ తాజాగా విచారణ ఎదుర్కోబోతున్నారు.
ఆ ఇద్దరూ.. మొన్నటిదాకా ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డారు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో ప్రచారపర్వం హోరెత్తింది. అటు జో బైడెన్.. ఇటు ట్రంప్ తమదైన క్యాంపెయిన్‌తో అదరగొట్టారు. అయితే.. ప్రచారంలో బాగా హైలైట్ అయిన పేరు మాత్రం జో బైడెన్ కుమారుడు హంటర్. గతంలో తన తండ్రి జో బైడెన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు హంటర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.
ఉక్రెయిన్‌లో వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన హంటర్ అమెరికాకు చెల్లించాల్సిన పన్నును ఎగ్గొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని హంటర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారంటూ ఇటీవలి ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు ట్రంప్. హంటర్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.
ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు తేలిపోయాయి. జో బైడెన్ విజయబావుటా ఎగురవేశారు. ఊహించని ఎన్నికల ఫలితాలతో నిశ్చేష్టుడైన ట్రంప్.. ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. జో బైడెన్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగానే బైడెన్ కుమారుడు హంటర్‌ను టార్గెట్ చేసుకున్నారు. చైనా, ఉక్రెయిన్‌లలో హంటర్ సాగించిన వ్యాపారాలపై దృష్టిసారించారు. హంటర్ టాక్స్ వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలంటూ విచారణ సంస్థల్ని ఆదేశించారు. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ కుమారుడు హంటర్ వెల్లడించడం గమనార్హం.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికీ ఓటమిని అంగీకరించడం లేదు. గెలుపు తనదేనంటూ బీరాలు పలుకుతున్నారు. కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో హంటర్‌పై ట్రంప్ తాజా నిర్ణయం సంచలనం కలిగిస్తోంది.
బైడెన్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ హంటర్‌పై తన అధికారాన్ని ఎక్కుపెడుతున్నాడన్న ప్రచారం సాగుతోంది. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న ట్రంప్ హంటర్‌పై కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారు. ఎప్పుడూ విచారణ జోలికి పోలేదు. గద్దె దిగాల్సిన సమయం ఆసన్నం కావడంతో హంటర్‌పై దర్యాప్తునకు పూనుకున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హంటర్ గతంలో డ్రగ్స్‌కు బానిసయ్యాడు. డ్రగ్స్‌కు అడిక్ట్ అయిన హంటర్ ఇటీవలే కోలుకున్నారు. ప్రచారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నాడు. హంటర్‌పై ట్రంప్ వర్గం చేస్తున్న ఆరోపణల్ని బైడెన్ సైతం ఖండించారు. ఉపాధ్యక్ష పదవి చేపట్టిన సమయంలో తన కొడుకుకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని చెబుతున్నారు బైడెన్. హంటర్ వ్యాపారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని.. తండ్రీకొడుకుల మధ్య ఎప్పుడూ ఆ విషయాలే ప్రస్తావనకు రావని స్పష్టం చేస్తున్నారు బైడెన్. ఓటమి బాధతో కుంగిపోతున్న ట్రంప్.. ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి..!
