Jumped Deposit Scam: జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి? ఇదో కొత్త రకం మోసం.. బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి

Jumped Deposit Scam: ఈ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఇటువంటి మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నిరంతరం నమోదు అవుతున్నాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డబ్బులు అందితే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు..

Jumped Deposit Scam: జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి? ఇదో కొత్త రకం మోసం.. బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి
Follow us
Subhash Goud

|

Updated on: Jan 05, 2025 | 9:39 PM

ఆన్‌లైన్ స్కామ్‌లో రోజురోజుకు కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనే మరో కొత్త ఆన్‌లైన్ స్కామ్ బయటపడింది. ఆన్‌లైన్ మోసపూరిత నేరస్థులు ప్రజల బ్యాంకు ఖాతాల నుండి డబ్బును దొంగిలించడానికి నిరంతరం కొత్త మార్గాలను రూపొందిస్తున్నారు. యూపీఐ (UPI) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త ‘జంప్డ్ డిపాజిట్ స్కామ్’ బయటపడింది. ఇందులో సైబర్ నేరగాళ్లు తెలివిగా ప్రజలను మోసం చేసి వారి ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేస్తున్నారు.

ఈ స్కామ్ ఎలా పని చేస్తుంది?

ఈ స్కామ్‌లో నేరస్థులు ముందుగా యూపీఐ ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాలో చిన్న మొత్తాన్ని జమ చేస్తారు. దీని తర్వాత వారు ఫోన్‌ చేసి పొరపాటున ఈ యూపీఐ నంబర్‌కు అమౌంట్‌ వచ్చిందని, ఆ మొత్తాన్ని తిరిగి పంపాలని అభ్యర్థిస్తుంటారు. వెంటనే బాధితులు తమ ఖాతాకు డబ్బు వచ్చిందో లేదు తెలుసుకునేందుకు తరచుగా UPI యాప్‌ని తెరిచి, వారి బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి PINని నమోదు చేస్తారు. ఈ సమయంలో మోసగాళ్లు ఇప్పటికే నకిలీ లావాదేవీ అభ్యర్థనను పంపి ఉంటారు. బాధితుడు వారి పిన్‌ను నమోదు చేసిన వెంటనే, అభ్యర్థన అంగీకరించబడుతుంది. వారి ఖాతా నుండి డబ్బు ఉపసంహరించుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి మోసాలు హైదరాబాద్‌లో కూడా చాలా జరుగుతున్నాయి. తాజాగా పృద్వీ అనే ఉద్యోగికి స్కామర్లు రూ.11 వేల రూపాయలు పంపించారు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి పొరపాటున మీ బ్యాంకు అకౌంట్‌కు డబ్బు పంపించామని, తిరిగి పంపాలని కోరగా, వెంటనే సదరు వ్యక్తి అప్రమత్తమై తాను ఆన్‌లైన్‌ చేయలేనని, తన వద్దకు వస్తే నగదును ఇచ్చేస్తానని బదులిచ్చాడు. ఫోన్‌ పెట్టేసిన స్కామర్లు ఓ అర గంట తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి పృద్వీని బెదిరించడం మొదలు పెట్టారు. అమౌంట్‌ ఇవ్వకుంటే నీ ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరించి మీ మొబైల్‌లో కాంటాక్ట్‌ నంబర్లందరికి పంపిస్తామని బెదిరించాడు. వెంటనే బాధితుడు ఆన్‌లైన్‌లో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడికి SMS రూపంలో నోటిఫికేషన్‌

ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్ SMS రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి.. పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే, నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. ఇంకేముంది మీ అకౌంట్‌లో ఉన్న డబ్బంతా నేరగాళ్లకు వెళ్లిపోతుంది.

పోలీసుల హెచ్చరిక

ఈ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఇటువంటి మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నిరంతరం నమోదు అవుతున్నాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డబ్బులు అందితే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

ఈ మోసాన్ని ఎలా నివారించాలి?

బ్యాలెన్స్‌ని వెంటనే చెక్ చేయవద్దు: ఏదైనా తెలియని డబ్బు మీ ఖాతాలోకి వస్తే, 15-30 నిమిషాలు వేచి ఉండండి. ఈ సమయంలో ఏదైనా మోసపూరిత అభ్యర్థనలు గడువు ముగిసిపోతాయి. స్కామర్‌లు మీ పిన్‌ని ఉపయోగించే అవకాశం పొందలేరు. తప్పు పిన్‌ని నమోదు చేయండి: బ్యాలెన్స్‌ని వెంటనే చెక్ చేయాల్సిన అవసరం ఉంటే, ఉద్దేశపూర్వకంగా తప్పు పిన్‌ని నమోదు చేయండి. ఇలా చేయడం ద్వారా ఏదైనా పెండింగ్ అభ్యర్థన తిరస్కరించబడుతుంది. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో తెలియని వారి నుంచి వచ్చిన యూపీఐ చెల్లింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమిళనాడు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

అప్రమత్తంగా ఉండండి

UPIని ఉపయోగిస్తున్నప్పుడు, ఏదైనా తెలియని వ్యక్తి నుండి వచ్చే డబ్బు, అభ్యర్థనల గురించి జాగ్రత్తగా ఉండండి. మోసపూరిత లావాదేవీలను నివారించడానికి, ఎల్లప్పుడూ తెలివిగా వ్యవహరించండి. మీ పిన్‌ను గోప్యంగా ఉంచండి. ఇలాంటి సంఘటనలపై వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.

ఇది కూడా చదవండి: New SIM Card Rules: ఇలాంటి వారు మూడేళ్ల వరకు సిమ్‌ కార్డ్ తీసుకోలేరు.. బ్లాక్‌ లిస్ట్‌లోనే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి